బకాయిలపై వందసార్లు మొరపెట్టుకున్నా కదలికలేదు

బకాయిలపై వందసార్లు మొరపెట్టుకున్నా కదలికలేదు

కేంద్ర ప్రభుత్వానికి నైతికత ఉంటే.. మూడు, నాలుగు రోజుల్లోగా తెలంగాణకు రావాల్సిన బకాయిలన్నీ విడుదల చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.7183 కోట్ల బకాయిలు రావాల్సి ఉందన్నారు. వందసార్లు మొరపెట్టుకున్నా కేంద్రం స్పందించడం లేదని చెప్పారు. బుధవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన బకాయిల వివరాలను వెల్లడించారు. 13వ ఫైనాన్స్ కమిషన్ నుంచి రూ.1129 కోట్లు, 14వ ఫైనాన్స్  కమిషన్ నుంచి రూ.815 కోట్లు , 15వ ఫైనాన్స్ కమిషన్ నుంచి రూ.1103 కోట్లు, ఏపీ విభజన చట్టంలోని వెనుకబడిన ప్రాంతాల ప్రాతిపదికన రూ.1350 కోట్లు, జీఎస్టీ (2020, 2021) బకాయిలు రూ.1,074 కోట్లు, జీఎస్టీ (2021, 2022) బకాయిలు రూ.1,350 కోట్లు  రావాల్సి ఉందని మంత్రి వివరించారు. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద తెలంగాణకు రావాల్సిన రూ.454 కోట్లను ఆంధ్రకు బదిలీ చేశారని, వాటిని తెలంగాణకు మళ్లీ కేటాయించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. 

ఇప్పటివరకు రైతుబంధు కోసం రూ.50,440 కోట్లను కేటాయించినట్లు వెల్లడించారు. 9వ విడత రైతు బంధులో 65 లక్షల మందికి రూ.7,800 కోట్లు అందుతాయన్నారు.  రైతు బంధుకు అర్హులైన రైతులు 60.10 లక్షల మంది ఉన్నట్లు తెలిపారు. కోటి 50 లక్షల ఎకరాల భూమి  రైతుబంధు పథకం పరిధిలో ఉందన్నారు. ఇంత బాగా చేస్తున్నా కేంద్రం అభినందించాల్సింది పోయి.. విమర్శలు చేస్తోందని మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఏడేళ్ల క్రితం మోడీ చెప్పిన మాట ఇంకా నెరవేరలేదని వ్యాఖ్యానించారు. స్వామినాథన్ కమిటీ సిఫారసులను యథాతథంగా అమలుచేస్తామని ఇచ్చిన హామీని కూడా బుట్టదాఖలు చేశారన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను వాటి స్ఫూర్తికి విరుద్ధంగా ఇష్టారాజ్యంగా అమలుచేయడం కూడా  స్వామినాథన్ ను అవమానించడమే అవుతుందని తెలిపారు.