ఇవాళ తెలగాణకు అమిత్ షా

ఇవాళ తెలగాణకు అమిత్ షా
  • సాయంత్రం సికింద్రాబాద్​లో మేధావులతో సదస్సు
  • రాత్రి పార్టీ కీలక నేతలతో భేటీ.. ఎన్నికల వ్యూహాలపై చర్చ

హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మంగళవారం రాష్ట్రానికి రానున్నారు. మధ్యాహ్నం ఆదిలాబాద్​లో ఏర్పాటు చేసే జన గర్జన బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. సాయంత్రం సికింద్రాబాద్​లో ప్రొఫెషనల్స్, మేధావుల సదస్సులో మాట్లాడుతారు. ఆ తర్వాత బేగంపేట్​లోని హోటల్ ఐటీసీ కాకతీయలో బీజేపీ కీలక లీడర్లతో సమావేశం అవుతారు. ఎన్నికల్లో పార్టీ గెలుపుపై వారికి దిశానిర్దేశం చేస్తారు. ఎస్టీ నియోజకవర్గాల్లో గెలుపు కోసం అమిత్ షా సభను రాష్ట్ర బీజేపీ శ్రేణులు వ్యూహాత్మకంగా ఆదిలాబాద్ టౌన్​లో ఏర్పాటు చేశాయి. రాష్ట్రంలో గిరిజన హక్కుల కోసం బీజేపీ పోరాడిన విధానంపై అమిత్ షా మాట్లాడనున్నారు. అదేవిధంగా, ఎస్టీలకు బీఆర్ఎస్ సర్కార్ చేసిన ద్రోహం, విస్మరించిన హామీలు, రిజర్వేషన్లపై అన్యాయం గురించి ప్రస్తావిస్తారు. 

రాజేంద్రనగర్​లో సభ రద్దు

ముందు ఖరారైన షెడ్యూల్ ప్రకారం.. ఆదిలాబాద్ సభ తర్వాత అమిత్ షా హైదరాబాద్ సిటీ శివారులోని రాజేంద్రనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో మరో బహిరంగ సభలో మాట్లాడాలి. కానీ.. దాన్ని రద్దు చేసి సికింద్రాబాద్​లో మేధావులు, ప్రొఫెషనల్స్​తో సదస్సు ఏర్పాటు చేశారు. సమాజంలో వివిధ వర్గాలను ప్రభావితం చేసే వీరితో అమిత్ షా సమావేశం కావడం.. రానున్న ఎన్నికల్లో పార్టీకి ఆ వర్గాల మద్దతు కూడగట్టడంలో భాగమేనని బీజేపీ లీడర్లు అంటున్నారు. తర్వాత, బీజేపీ కీలక లీడర్లతోనూ అమిత్ షా భేటీ అవుతారు. పోలింగ్ కు కేవలం 50 రోజుల టైమ్ మాత్రమే ఉండటంతో ప్రజలకు దగ్గరయ్యేందుకు వీలైనన్ని ఎక్కువ సభలు ఏర్పాటు చేయడంపైనే రాష్ట్ర నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు.

అమిత్ షా టూర్ షెడ్యూల్​

మంగళవారం మధ్యాహ్నం 1.45 గంటలకు అమిత్ షా బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. 2.35 గంటలకు హెలికాప్టర్ లో ఆదిలాబాద్ రీచ్ అవుతారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా జన గర్జన సభలో పాల్గొంటారు. సాయంత్రం 5గంటలకు తిరిగి బేగంపేట్ ఎయిర్ పోర్టుకు వచ్చేస్తారు. సాయంత్రం 5.20 గంటల నుంచి 6.00 గంటల దాకా బేగంపేట్ లోని హోటల్ ఐటీసీ కాకతీయలో రెస్ట్ తీసుకుంటారు. సాయంత్రం 6.20 గంటలకు సికింద్రాబాద్ సిక్ విలేజ్ లోని ఇంపీరియల్ గార్డెన్ లో జరగనున్న మేధావులు, ప్రొఫెషనల్స్ సదస్సులో పాల్గొంటారు. మేధావుల నుంచి వివిధ అంశాలపై అభిప్రాయాలు తీసుకుంటారు. బీజేపీ మెనిఫెస్టోలో ఎలాంటి అంశాలు చేర్చాలనే దానిపై వారి సలహాలు, సూచనలు తీసుకుంటారు. తర్వాత రాత్రి 7.40 గంటలకు తిరిగి ఐటీసీ కాకతీయకు చేరుకుంటారు. సాయంత్రం 7.40 నుంచి రాత్రి 8.20 వరకు బీజేపీ కీలక నేతలతో అమిత్ షా భేటీ అవుతారు. ఎన్నికల వ్యూహాలపై చర్చిస్తారు. రాత్రి 8.20 నుంచి 9.20 దాకా డిన్నర్ కోసం రిజర్వ్ చేశారు. ఈ టైమ్​లో కూడా పార్టీలోని కొందరు కీలక నేతలతో భేటీ అవుతారని పార్టీ వర్గాల సమాచారం. తర్వాత బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకొని అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లిపోతారు.

జన గర్జన సభకు భారీ ఏర్పాట్లు

ఆదిలాబాద్, వెలుగు: ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత బీజేపీ ఆదిలాబాద్​లోని డైట్​కాలేజీ గ్రౌండ్​లో నిర్వహిస్తున్న అమిత్​షా జనగర్జన సభకు భారీ ఏర్పాట్లు చేశారు. దాదాపు లక్ష మందిని సభకు సమీకరించేలా నాయకులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, ఎంపీ సోయం బాపూరావ్​సోమవారం సభా ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సభాస్థలిని పరిశీలించారు. భద్రత ఏర్పాట్లపై ఆరా తీశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు. డీఏస్పీలు, సీఐలు, ఎస్సైలు, పోలీసులు సభా స్థలాన్ని వారి ఆధీనంలోకి తీసుకున్నారు. స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో అమిత్ షా హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం కానుండగా ఆయన తిరిగి వెళ్లిపోయే వరకు పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు.