ఉగ్రదాడి కాదు.. జమ్మూ కాశ్మీర్ పేలుడుపై కేంద్ర హోం శాఖ కీలక ప్రకటన

ఉగ్రదాడి కాదు.. జమ్మూ కాశ్మీర్ పేలుడుపై కేంద్ర హోం శాఖ కీలక ప్రకటన

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‎లోని నౌగామ్​పోలీస్​స్టేషన్ ఆవరణలో చోటు చేసుకున్న పేలుడు ఘటనపై కేంద్రం హోం మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ పేలుడు ఉగ్రదాడి కాదని.. ప్రమాదవశాత్తూ జరిగిందని స్పష్టం చేసింది. పోలీస్ స్టేషన్ పై ఉగ్రదాడి అంటూ జరుగుతోన్న ప్రచారాన్ని తోసిపుచ్చింది. 

ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ కేసులో భాగంగా పోలీసులు ఇటీవల 350 కిలోల అమ్మోనియా నైట్రేట్‎ను స్వాధీనం చేసుకుని నౌగామ్​పోలీస్​స్టేషన్‎లో భద్రపర్చారని తెలిపింది. మేజిస్ట్రేట్ సమక్షంలో పేలుడు పదార్థాలను సీల్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ పేలుడు సంభవించిందని వివరణ ఇచ్చింది. ఇందులో ఎలాంటి ఉగ్ర కుట్ర కోణం లేదని స్పష్టం చేసింది. జైష్-ఎ-మహమ్మద్‌తో సంబంధం ఉన్న  PAFF టెర్రర్ గ్రూప్ ఈ సంఘటనకు బాధ్యత వహించడాన్ని కేంద్ర హోంశాఖ ఖండించింది. 

కాగా, శనివారం(నవంబర్​ 15) తెల్లవారు జామున నౌగామ్​పోలీస్​స్టేషన్‎లో చోటు చేసుకున్న భారీ పేలుడులో 9 మంది మృతి చెందగా.. 30 మంది గాయపడ్డారు. పేలుడు దాటికి పోలీస్ స్టేషన్ నేలమట్టం కాగా.. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ పేలుడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. మరోవైపు.. శనివారం (నవంబర్ 15) సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా జమ్మూ కశ్మీర్‌కు వెళ్లనున్నారు. నౌగాంలో పేలుడు ప్రదేశాన్ని అధికారులతో కలిసి ఆయన పరిశీలించనున్నారు.