గోదావరితో కావేరిని కలుపుతాం

గోదావరితో కావేరిని కలుపుతాం

హైదరాబాద్‌‌, వెలుగు: గోదావరి, కావేరి నదులను లింక్ చేస్తామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌‌ షెకావత్‌‌ తెలిపారు. మొదటి దశలో141 టీఎంసీలు, రెండో దశలో మరో 236 టీఎంసీలు ఈ ప్రాజెక్టులో భాగంగా మళ్లిస్తామని పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌‌ భవన్‌‌లో నిర్వహించిన ఎన్‌‌డబ్ల్యూడీఏ 36వ జనరల్‌‌ బాడీ మీటింగ్‌‌, నదుల అనుసంధానంపై ఏర్పాటు చేసిన టాస్క్‌‌ఫోర్స్‌‌ కమిటీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఎన్‌‌డబ్ల్యూడీఏ జనరల్‌‌ బాడీలో అన్ని రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఉంటారు. దేశంలో ఏ ఒక్క రాష్ట్ర సీఎం కూడా ఈ మీటింగ్‌‌కు హాజరుకాలేదు. కేసీఆర్‌‌ ఢిల్లీలోనే ఉన్నా విజ్ఞాన్‌‌ భవన్‌‌ వైపు కన్నెత్తి చూడలేదు. సమావేశంలో కేంద్ర మంత్రి షెకావత్‌‌ మాట్లాడుతూ.. చెన్నై తాగునీటితో పాటు తమిళనాడు రాష్ట్ర అవసరాల కోసం గోదావరి, కృష్ణా, పెన్నా,- కావేరి నదుల అనుసంధానం చేపట్టాల్సి ఉందన్నారు. మొదటి దశలో చత్తీస్‌‌గఢ్‌‌ ఉపయోగించుకోని 141 టీఎంసీల నీళ్లు మాత్రమే ఈ ప్రాజెక్టులో భాగంగా తరలిస్తామన్నారు. హిమాలయన్‌‌ రివర్స్‌‌ లింకింగ్‌‌ పూర్తయ్యాక మిగతా నీటిని తరలించే ప్రక్రియ చేపడుతామన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో అప్పటి ప్రధాని వాజపేయి నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టారని, ప్రధాని మోడీ ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ కెన్‌‌–బెట్వా లింక్‌‌ ప్రాజెక్టు చేపట్టారని తెలిపారు. గోదావరి, కావేరి అనుసంధానంపై ఏకాభిప్రాయం సాధించడానికి ఇప్పటికే నాలుగు సమావేశాలు నిర్వహించామన్నారు. 

ముందు మహానదితో లింక్ చెయ్యాలె.. 

తెలంగాణ ప్రతినిధులుగా సమావేశానికి వర్చువల్‌‌గా హాజరైన ఇంటర్‌‌ స్టేట్‌‌ సీఈ మోహన్‌‌ కుమార్‌‌, గోదావరి బేసిన్‌‌ డీడీ సుబ్రమణ్య ప్రసాద్‌‌ మాట్లాడుతూ.. మహానదితో గోదావరి అనుసంధానం అయ్యాకే కావేరి లింక్‌‌ చేపట్టాలని కోరారు. గోదావరిలో మిగులు జలాలే లేవని, చత్తీస్‌‌గఢ్‌‌ వాటా నీటిని అనుసంధానానికి ఉపయోగించడం సరికాదన్నారు. తెలంగాణ భూభాగం నుంచి రివర్‌‌ లింకింగ్‌‌ చేపడుతున్నందున తమ ప్రాజెక్టుల ఆయకట్టు పరిధిలో లేని ప్రాంతాలకు దీని నుంచి నీళ్లు ఇవ్వాలని కోరారు. పోలవరం నుంచే రివర్‌‌ లింకింగ్‌‌ చేపట్టాలని ఏపీ ప్రతినిధులు కోరారు. పోలవరం నుంచి పులిచింతల, నాగార్జునసాగర్‌‌ మీదుగా రాయలసీమ నుంచి తమిళనాడుకు నీళ్లిచ్చేలా ప్రాజెక్టు చేపట్టాలని కోరారు. గోదావరి, కావేరి అనుసంధానం తొలి దశలో తమ రాష్ట్రానికి 38.6 టీఎంసీలే ఇస్తున్నారని, రెండో దశలోనైనా తమ అవసరాలకు సరిపడేటన్ని నీళ్లు కేటాయించాలని తమిళనాడు ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.