పాతబస్తీ హిందువుల జాగీర్ .. తెలంగాణలో రామరాజ్యం తీసుకురావాలి : బండి సంజయ్

పాతబస్తీ హిందువుల జాగీర్ .. తెలంగాణలో రామరాజ్యం తీసుకురావాలి : బండి సంజయ్
  • లాల్ దర్వాజ బోనాల జాతరలో కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు

హైదరాబాద్​సిటీ, వెలుగు: పాతబస్తీ హిందువుల జాగీర్ అని, భాగ్యనగర్​ హిందువుల అడ్డా అని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. టెర్రరిస్టులకు భయపడి ఇక్కడి నుంచి వెళ్లిపోయిన హిందువులు అంతా వెనక్కి తిరిగిరావాలన్నారు. వారిని కాపాడుకుంటామని తెలిపారు. ఆదివారం ఆయన లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వేదికపై మాట్లాడారు. ‘‘పాతబస్తీలో ఎవరు టాక్స్ కడుతున్నరు, ఎవరు కరెంట్ బిల్లులు కడుతున్నరు, ఎవరు ఇంటి పన్ను కడుతున్నరు. ఎవరు పైసలు ఇస్తే పాతబస్తీలో బతుకుతున్నరో ఒక్కసారి హిందూ సమాజం ఆలోచించాలి. పాతబస్తీలో ప్రతి హిందువు పన్నులు చెల్లిస్తే.. కొంతమంది పన్నులు చెల్లించకుండా దాడులు చేసే సంస్కృతి వచ్చింది. 

ఇది మారాలంటే ఎవరి రాజ్యం రావాలో పాతబస్తీ హిందువులు ఆలోచించాలి”అని అన్నారు. ‘‘అన్ని రాజకీయ పార్టీలు 12 శాతం ఉన్న ఓ వర్గం ప్రజల ఓట్ల కోసం కక్కుర్తి పడుతున్నయి. 80శాతం ఉన్న హిందువులు ఓటు బ్యాంకుగా మారరనే, హిందువులు గంపగుత్తగా ఓట్లు వేయరనే చెడుఆలోచనతో ఈ రాజకీయ పార్టీలు ఉన్నయి. అందుకే హిందూ సమాజం ఏకం కావాలి, రాష్ట్రంలో రామరాజ్యం తీసుకురావాలి” అని అన్నారు. ‘అయ్యా బాంచెన్ మేము జాతర చేసుకుంటం, బోనాలు చేసుకుంటం.. గణేశ్ నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటం.. అని ప్రభుత్వాలను అడుక్కొనే పరిస్థితి ఎంత సిగ్గు చేటో.. భాగ్యనగర్​లో ఉన్న ప్రతి హిందువూ ఆలోచించాలి’ అని అన్నారు. హిందువుల రాజ్యం తెలంగాణలో ఏర్పడితే.. ఈ పాతబస్తీలో ప్రతి దేవాలయానికి ప్రత్యేక నిధులు ఇస్తామన్నారు. ఇక్కడ గల్లీ గల్లీలో ఆలయాలు నిర్మించే బాధ్యత తీసుకుంటామన్నారు. ఏ పండుగ చేయాలన్నా వాళ్లను వీళ్లను పైసలు అడిగే పరిస్థితి ఉండదన్నారు. 

ఈ ఏకే 47లు ఎన్ని రోజులు రక్షిస్తాయి: ఎమ్మెల్యే పైడి రాకేశ్​ రెడ్డి

 తాను అమ్మవారి దర్శనానికి వస్తుంటే ఒక దేవాలయం దగ్గర ఒక పోలీసు, ఒక భక్తుడు, ఒక పూజారి మాత్రమే ఉన్నాడని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి అన్నారు. ఇది హిందువులకు కనువిప్పు కావాలన్నారు. ఆరువేల మంది కాశ్మీర్​లోని వైష్ణోదేవి యాత్రకు వెళ్తే.. 60 వేల మంది ఏకే 47లతో బందోబస్తు ఉండాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఇక్కడ కూడా దర్శనానికి వస్తుంటే యూనిఫామ్​లు, ఏకే 47లే కనిపిస్తున్నయని, ఎన్ని రోజులు ఈ యూనిఫామ్​లు రక్షిస్తాయని ప్రశ్నించారు. పోలీసుల మీద నమ్మకం పెట్టుకుంటే వెస్ట్ బెంగాల్​లో హిందువుల పరిస్థితే మనకు వస్తుందన్నారు. హిందువులే ఒకరికొకరు కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.