బీఆర్ఎస్ నేతలంతా సుద్ద పూసలా? :కేంద్ర మంత్రి బండి సంజయ్ 

బీఆర్ఎస్ నేతలంతా సుద్ద పూసలా? :కేంద్ర మంత్రి బండి సంజయ్ 
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు డ్రామా ఆర్టిస్టుల్లా మారారు
  • కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్

కరీంనగర్, వెలుగు: ‘బీఆర్ఎస్ నేతలంతా సుద్ద పూసలా? ఏ ఒక్క అవినీతి చేయలేదా?’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ నేతలను ఎందుకు అరెస్ట్ చేసి జైలుకు పంపడం లేదని ప్రశ్నించారు. మంగళవారం కరీంనగర్ లో  మీడియాతో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ లో కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీలు వ్యవహరిస్తున్న తీరు సిగ్గు చేటని, ఆ  రెండు పార్టీలు కుమ్మక్కయి ప్రజా సమస్యలను దారి మళ్లిస్తున్నాయని విమర్శించారు. అసెంబ్లీలో బీఆర్ ఎస్ నాయకులు సమస్యలపై ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు.

గుజరాత్ సీఎంగా, దేశ ప్రధానిగా మోదీ 25 ఏండ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఈ నెల 17 నుంచి  అక్టోబర్ 17 వరకు బీజేపీ ఆధ్వర్యంలో ''సేవా సంకల్ప్ అభియాన్ - జన్ సేవా హీ ప్రభు సేవా” పేరిట దేశవ్యాప్తంగా విస్త్రత కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. అందులో భాగంగా ఈ నెల 17న సాయంత్రం 7 గంటలకు 'ఆశీర్వాద దీపం' పేరిట మోదీ నిండు నూరేండ్లు ప్రజా సేవలో తరలించాలని భగవంతుడిని వేడుకుంటూ దీపాలను వెలిగించనున్నట్టు తెలిపారు. అదే రోజు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలను నిర్వహించనున్నట్టు ప్రకటించారు. అలాగే, ‘సేవ-, అంకితభావం-25 సంవత్సరాలు, వికసిత భారతదేశం’ అనే అంశాలపై ఈ నెల 17 నుంచి అక్టోబర్ 7 వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చిత్రలేఖనం, ప్రసంగ పోటీలు నిర్వహిస్తాన్నారు. గ్రామాల్లో వివిధ రూపాల్లో విస్త్రుతంగా కళా ప్రదర్శనలు నిర్వహిస్తామని చెప్పారు. 

17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో  తెలంగాణ విమోచన దినోత్సవం

ఈ నెల 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడకలు నిర్వహిస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఈ వేడుకలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మజ్లిస్ పార్టీకి భయపడి కాంగ్రెస్​ పార్టీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపడం లేదని, తెలంగాణ అమరవీరుల బలిదానాలను పట్టించుకోకపోవడం, సమాజానికి చూపకపోవడం సిగ్గుచేటన్నారు. మీడియా సమావేశంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బోయిన్ పల్లి ప్రవీణ్ రావు, బీజేపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.