- గత ప్రభుత్వంలో మున్సిపల్ మంత్రిగా ఆయన విఫలం: బండి సంజయ్
- రౌడీషీటర్ దాడిలో గాయపడ్డ డీసీపీ, కానిస్టేబుల్‌కు పరామర్శ
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లో ఒక్క వర్షం వచ్చినా.. మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ పదేండ్ల వైఫల్యం బయటపడుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం ఎక్స్ వేదికగా ఆయన కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింలకు శ్మశానవాటికల కోసం బీఆర్‌ఎస్ డిమాండ్ చేయగలిగినప్పుడు, హిందువులకు దేవాలయం కోసం బీజేపీ మాట్లాడటం నేరం ఎలా అవుతుందని ప్రశ్నించారు.
బంజారాహిల్స్‌లోని పెద్దమ్మ గుడి పునర్నిర్మాణం గురించి మాట్లాడటం తప్పా? అని అడిగారు. తాను దేవాలయాల గురించి మాట్లాడినప్పుడు, వాటి అభివృద్ధి గురించి కూడా మాట్లాడానని.. కానీ మూర్ఖులు ఎప్పుడూ తమకు నచ్చిన దాన్నే వింటారని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ అంటే బంగ్లాలే అని కేటీఆర్ బతికారని, ఇప్పుడు బస్తీల ప్రజలు గొంతు విప్పుతుంటే.. కేటీఆర్ శ్రద్ధ చూపిస్తున్నట్టు నటిస్తున్నారని విమర్శించారు. తమ విశ్వాసం ప్రకారం దేవాలయాలు నగరం నడిబొడ్డున ఉండాలని, శ్మశానాలు నగరం వెలుపల ఉండాలన్నారు.
కానీ బీఆర్ఎస్ మాత్రం నగరాన్ని శ్మశానంగా మార్చాలని చూస్తోందని ఆరోపించారు. కాగా, సంఘ విద్రోహ శక్తులకు, రౌడీషీటర్లకు మద్దతిచ్చేవాళ్లను కూడా సంఘ విద్రోహశక్తులుగానే పరిగణించాలని బండి సంజయ్ అన్నారు. శాంతిభద్రతల విషయంలో పోలీసులు రాజీ పడొద్దన్నారు. ఈ విషయంలో పోలీసులకు కేంద్రం పూర్తిగా అండగా ఉంటుందన్నారు. రౌడీషీటర్ అన్సారీ దాడిలో గాయపడి సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్, కానిస్టేబుల్ వీఎస్ఎన్ మూర్తిని బండి సంజయ్ ఆదివారం పరామర్శించారు. విధి నిర్వహణలో వారి తెగువను ప్రశంసించారు.
