
- అవినీతి బయటకు రావాలంటే సీవీసీ విచారణ కోరాలె: బండి సంజయ్
హైదరాబాద్, వెలుగు: ప్రజల దృష్టిని మళ్లించేందుకే ‘అమృత్’ స్కీమ్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. దేశంలోని పట్టణాల్లో మౌలికవసతుల కోసం కేంద్ర ప్రభుత్వం అమృ త్ స్కీమ్ తీసుకొచ్చిందని, దీనిపై గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డాయని ఆయన ఆరోపించారు. దీంతో ఈ స్కీమ్ ప్రయోజనాలు ప్రజలకు అందడం లేదని సోమవారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.
అమృత్ స్కీమ్‌లో అవినీ తి జరిగిందని రెండూ పార్టీలు ఆరోపణలు గుప్పించుకుంటూ డ్రామాలాడుతున్నాయని ఆయన ఫైర్ అయ్యారు. ‘‘ఈ స్కీంలో చోటుచేసుకున్న అవినీతిని వెలికితీయాలన్నా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఆరోపణల్లో నిజాలు బయటకు రావాలన్నా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) ఆధ్వర్యంలో విచారణ జరిపించాలి.
అమృత్ పథకంలో జరిగిన అవినీతిపై విచారణ కోరుతూ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం సీవీసీకి లేఖ రాయాలి” అని సంజయ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాస్తే దీనిపై విచారణ జరిపేందుకు సీవీసీని ఒప్పించేలా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హోదాలో తాను వ్యక్తిగతంగా చొరవ తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు.