
- పాలన మరిచి పైసలకు ఎగవడ్డరు
- రాష్ట్రం వచ్చాక కేసీఆర్ కుటుంబమే బాగు పడ్డది
- టీఆర్‌ఎస్ సర్కారుపై కేంద్ర మంత్రి భగవంత్ కూబ ఫైర్
- ఎరువుల కొరత లేదని వెల్లడి
హైదరాబాద్/కరీంనగర్, వెలుగు: టీఆర్‌ఎస్ సర్కారులో పాలన మరిచిపోయి సంపాదనకు ఎగబడ్డారని కేంద్ర కెమికల్స్, ఫర్టిలైజర్స్ శాఖ సహాయ మంత్రి భగవంత్ కూబ విమర్శించారు. రాష్ట్రం వచ్చాక కేసీఆర్ కుటుంబానికే లాభం జరిగిందని చెప్పారు. కేసీఆర్ సీఎం అయ్యారని.. కొడుకు, అల్లుడు మంత్రులు, బిడ్డ ఎంపీ అయ్యారన్నారు. ఆదివారం కరీంనగర్ రేకుర్తిలోని రాజశ్రీ గార్డెన్‌లో బీజేపీ కార్యకర్తల గెట్ టు గెదర్ సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు విలువ లేదని.. వాళ్లను సీఎం కలవరని అన్నారు. కోట్ల మంది ప్రజలను పాలిస్తున్న ప్రధానినైనా ఒక్కరోజులో కలవొచ్చని, కేసీఆర్‌ను మాత్రం కలిసే పరిస్థితి లేదని విమర్శించారు. ‘ఇక్కడ చూడండి. రాష్ట్ర అధ్యక్షుడు ప్రజల మధ్య కూర్చున్నారు. బీజేపీ అంటే ఇదే’ అన్నారు. రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ పనులను సమీక్షించి అక్కడి సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు.
ఏ రాష్ట్రానికి ఎంతిచ్చినమో వివరాలన్నీ ఉన్నయ్
అంతకు ముందు బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో పార్టీ అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్‌తో కలిసి కూబ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఎరువుల కొరత లేదని చెప్పారు. ఏ రాష్ట్రానికి ఎంత మొత్తంలో ఎరువులను కేటాయించామో పూర్తి వివరాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో యూరియా 3.8 లక్షల టన్నులు, డీఏపీ 45,000 టన్నులు, ఎన్పీకె 3.29 లక్షల టన్నులు, ఎంవోపీ 55,600 టన్నులు అందుబాటులో ఉందని వెల్లడించారు. ప్రతి మంగళవారం తెలంగాణ అధికారులతో మీటింగ్ నిర్వహిస్తామని, తాము పారదర్శకంగా పని చేస్తామని అన్నారు. రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభిస్తుండటంతో ఎరువుల కొరత ఉండదని, లోకల్ పబ్లిక్‌కు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. రామగుండంతో పాటు 5 ఫర్టిలైజర్ కంపెనీలను దేశవ్యాప్తంగా ప్రారంభించబోతున్నామని చెప్పారు. మొన్నటి కేబినెట్ విస్తరణలో విద్యావంతులకు అవకాశం కల్పించారని చెప్పారు.
ఎయిర్ పోర్టు దగ్గర ఘన స్వాగతం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేంద్ర మంత్రి కూబకు సంజయ్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, ఇతర నేతలు ఘన స్వాగతం పలికారు.