మెడికల్​ కాలేజీలపై తెలంగాణ ప్రపోజల్స్ పంపలే

మెడికల్​ కాలేజీలపై తెలంగాణ ప్రపోజల్స్ పంపలే

మెడికల్​ కాలేజీలపై తెలంగాణ ప్రపోజల్స్ పంపలే
లోక్​సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడి
అందుకే తెలంగాణకు కాలేజీలు ఇవ్వలేక పోయాం

న్యూఢిల్లీ/హైదరాబాద్, వెలుగు: జిల్లా హాస్పిటళ్లను మెడికల్ కాలేజీలుగా మార్చేందుకు ప్రపోజల్స్ ఇవ్వాలని కోరినా, తెలంగాణ ప్రభుత్వం పంపించలేదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. శుక్రవారం లోక్​సభలో ఎంపీ రేవంత్‌‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలు లేని జిల్లాల్లోని ప్రధాన హాస్పిటళ్లను మెడికల్ కాలేజీలుగా తీర్చిదిద్దేందుకు 2014లో ఓ స్కీమ్‌‌ను ప్రారంభించామని, ఈ స్కీమ్‌‌లో భాగంగా అన్ని రాష్ట్రాలకు కలిపి మూడు దశల్లో 157 కాలేజీలను మంజూరు చేసి, నిధులిచ్చామన్నారు. తెలంగాణ నుంచి మాత్రం ఎలాంటి స్పందనా రాలేదని చెప్పారు. ప్రపోజల్స్ రాకపోవడంతో తెలంగాణకు మెడికల్​ కాలేజీలు ఇవ్వలేకపోయామని ఆయన వెల్లడించారు.

పార్లమెంట్ సాక్షిగా కేంద్రం అబద్ధాలు: హరీశ్

ఈ అంశంపై స్పందించిన రాష్ట్ర వైద్య శాఖ మంత్రి హరీశ్‌‌రావు.. పార్లమెంట్ సాక్షిగా కేంద్రం అబద్ధాలు చెబుతోందని ఆరోపించారు. గతంలో ఆరోగ్యశాఖ మంత్రులుగా ఉన్న లక్ష్మారెడ్డికి, ఈటల రాజేందర్‌‌‌‌కు అప్పటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రులు రాసిన లేఖలను ట్వీట్‌‌ చేశారు. కరీంనగర్‌‌‌‌, ఖమ్మంలోని జిల్లా హాస్పిటళ్లను మెడికల్ కాలేజీలుగా మార్చేందుకు నిధులు ఇవ్వాలని అప్పట్లో ఈటల కేంద్రానికి లేఖ రాశారు. ఈ లేఖకు జవాబిస్తూ తొలి రెండు దశల్లో తెలంగాణ లేదని, మూడో దశలో తెలంగాణకు మెడికల్ కాలేజీలు ఇవ్వాలని నిర్ణయించామని అప్పటి కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌‌ ఈటలకు లేఖ రాశారు. ఈ మేరకు స్కీమ్ నిబంధనల ప్రకారం పూర్తి వివరాల(డీపీఆర్‌‌, డిటైల్డ్‌‌ ప్రాజెక్ట్‌‌ రిపోర్ట్‌‌)తో ప్రపోజల్స్‌‌ పంపించాలని లేఖలో సూచించారు. లక్ష్మారెడ్డికి రాసిన లేఖలోనూ ఇదే విషయాన్ని పేర్కొన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎయిమ్స్‌‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, తెలంగాణలో రెండో దశలో ఎయిమ్స్ ఏర్పాటు చేస్తామని అప్పటి కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. ఆ తర్వాత భువనగిరిలో ఎయిమ్స్ ఏర్పాటు చేశారు.