ప్రజల్లో భద్రతాభావం పెంపొందించడం, నేరాల నియంత్రణ లక్ష్యంగా మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఐపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 70 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. తనిఖీల సందర్భంగా సరైన పత్రాలు లేని 45 వాహనాలను తాత్కాలికంగా సీజ్ చేశారు. సంబంధిత వాహన యజమానులు అవసరమైన పత్రాలు సమర్పించి తమ వాహనాలను తీసుకెళ్లాలని సూచించారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ నేరాల నిర్మూలన, ప్రజల రక్షణ, భద్రతాభావం కల్పించడంలో భాగంగానే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రాంతాల్లో కొత్త వ్యక్తులు లేదా నేరచరిత్ర కలిగిన వ్యక్తులు ఆశ్రయం పొందుతున్నారా అనే విషయాలను గుర్తించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. ఎవరైనా కొత్త వ్యక్తులు అద్దెకు ఇల్లు తీసుకోవడానికి వస్తే వారి పూర్తి వివరాలు సేకరించడంతో పాటు ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు పత్రాలను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
ప్రజలకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారనే నమ్మకాన్ని పెంపొందించడం, ప్రజా-పోలీసు సంబంధాలను మరింత బలోపేతం చేయడమే కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ సందర్భంగా డిజిటల్ అరెస్ట్, ఫోన్ కాల్ బ్లాక్‌మెయిల్, ఓటీపీ మోసాలు, పార్ట్‌టైమ్ జాబ్ ఫ్రాడ్స్, ఫేక్ లింకుల ద్వారా జరిగే సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనుమానాస్పద కాల్స్, సందేశాలకు స్పందించకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఈ తనిఖీల సందర్భంగా జూబి స్నిఫర్ డాగ్‌తో పాటు పోర్టబుల్ ఫింగర్‌ప్రింట్ డివైస్‌లను వినియోగించినట్లు అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులను గుర్తించడం, వారి వివరాలను ధృవీకరించడం, నేరస్తులను గుర్తించడంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తున్నామని చెప్పారు.
అలాగే 18 సంవత్సరాలు నిండని బాలికను వివాహం చేసుకోవడం, ఆమె అంగీకారం తెలిపినా కూడా చట్టం దృష్టిలో అది తీవ్రమైన నేరమని పేర్కొన్నారు. ప్రేమ పేరుతో మైనర్ బాలికను తీసుకువెళ్లడం, ప్రలోభపెట్టడం వంటి చర్యలు కూడా తీవ్రమైన నేరాల కింద పరిగణించబడతాయని హెచ్చరించారు. బాలల రక్షణ కోసం పోక్సో చట్టం కఠినంగా అమలవుతోందని తెలిపారు.
వాహనాల కొనుగోలు సమయంలో అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించాలని, ఆర్సీని తప్పనిసరిగా తమ పేరుపై బదిలీ చేసుకోవాలని సూచించారు. వాహనంపై ఫైనాన్స్ లేదా ఇతర బకాయిలు ఉన్నాయో లేదో నిర్ధారించుకున్న తర్వాతే కొనుగోలు చేయాలని అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ తెలిపారు.
ఈ కార్యక్రమం లో మెదక్ డియస్పి ప్రసన్న కుమార్, సీఐ లు మహేష్, రాజశేఖర్ రెడ్డి, జర్జ్, ఎసై లు, సిబ్బంది పాల్గొన్నారు
