ధరణి పేరుతో ప్రభుత్వమే భూములు దోచుకుంటున్నది : కిషన్ రెడ్డి

ధరణి పేరుతో ప్రభుత్వమే భూములు దోచుకుంటున్నది : కిషన్ రెడ్డి

ధరణి పేరుతో ప్రభుత్వమే భూములు దోచుకుంటున్నది
బినామీలు, గులాబీ నేతలకు వేలాది ఎకరాలు కట్టబెడ్తున్నది: కిషన్ రెడ్డి
ధరణి పోర్టల్​లో 10 లక్షల దరఖాస్తులు పెండింగ్​లో ఉన్నయ్ 
కేబినెట్ సబ్ కమిటీ రిపోర్టు ఏమైంది? 
ధరణి అప్లికేషన్లపై స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు : ధరణి పేరుతో రాష్ట్ర ప్రభుత్వమే భూఆక్రమణలకు పాల్పడుతున్నదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. వేలాది ఎకరాలను బినామీ కంపెనీలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, గులాబీ నేతలకు దోచి పెట్టింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు, రియల్ ఎస్టేట్​వ్యాపారులు కుమ్మక్కయి.. హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న భూములను ప్లాట్లుగా మార్చి అమ్ముకుంటున్నారని చెప్పారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘ భూ సమస్యలకు సర్వరోగ నివారిణిగా తెచ్చిన ధరణి పోర్టల్ తో భూసమస్యలు మరింత పెరిగాయి. ధరణిలో దాదాపు 10 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి” అని ఆయన చెప్పారు.

‘ధరణిలో మార్పులుచేర్పులన్నీ ప్రగతి భవన్ నుంచే జరుగుతున్నాయి.​ ధరణి లాకింగ్, అన్ లాకింగ్ ప్రగతి భవన్ నుంచి జరుగుతున్నది నిజం కాదా? దీన్ని బట్టి ధరణి ప్రజల కోసం కాదు.. బీఆర్ఎస్ నేతల కోసమేనని తేలిపోయింది. ధరణిని అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ నేతలు విచ్చలవిడిగా భూఆక్రమణలకు పాల్పడుతున్నారు. దళారులుగా మారి సెటిల్ మెంట్లు చేస్తున్నారు. ధరణి సమస్యలపై కోర్టుకు వెళ్లిన రైతుల భూములు గుంజుకుంటున్నారు. భూములను ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ధరణితో నిమిషాల్లోనే మ్యుటేషన్ జరుగుతుందని, అవీనితికి తావుండదని సీఎం కేసీఆర్ చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది” అని కిషన్​ రెడ్డి అన్నారు.  

ఆత్మహత్యలు చేసుకుంటున్నా స్పందించరా?  

భూసమస్యలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ‘‘ధరణిలో రైతులు పెట్టుకునే దరఖాస్తులకు ఫీజులు వసూలు చేయడం దారుణం. ఓవైపు భూమి కోల్పోయి, మరోవైపు ఫీజులు చెల్లించలేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ధరణితో ప్రతి కుటుంబంలో, గ్రామంలో తగాదాలు పెరుగుతున్నాయి. ధరణి అంతా బాగుంటే, కేబినెట్ సబ్​కమిటీ ఎందుకు వేశారు? అసలు ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టులో ఏముంది? దానిపై ఏం చర్యలు తీసుకున్నారు?” అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ధరణి అప్లికేషన్లపై స్టేటస్ రిపోర్టు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘‘ఒకప్పుడు గ్రామ స్థాయిలో పరిష్కారమయ్యే భూసమస్యలు.. ఇప్పుడు ప్రగతి భవన్​ చేతిలో ఉన్నాయి. ఈ పోర్టల్ పేరుతో రెవెన్యూ వ్యవస్థను ప్రభుత్వం పూర్తిగా నిర్యీర్యం చేస్తున్నది” అని మండిపడ్డారు.   

కిషన్ రెడ్డితో మందకృష్ణ భేటీ

ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. కర్నాటక ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చారు. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణపై  కిషన్ రెడ్డితో మందకృష్ణ చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేస్తామని ఇప్పటికే బీజేపీ హామీ ఇచ్చింది.

కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలోనే... 

జగిత్యాల ఎస్సై అనిల్ సస్పెన్షన్ పై కిషన్ రెడ్డి స్పందించారు. ప్రభుత్వాన్ని కేసీఆర్ నడుపుతున్నప్పటికీ స్టీరింగ్ మాత్రం ఎంఐఎం చేతిలోనే ఉన్నదని, అందుకు జగిత్యాల ఘటనే నిదర్శనమని అన్నారు. హైదరాబాద్ పాతబస్తీలో అధికారుల మీద దాడులు జరుగుతున్నాయని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. ‘‘వందల కోట్లు పెట్టి కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. హైదరాబాద్​లో టెర్రరిస్టుల కదలికలను గుర్తించకుండా ఏం చేస్తున్నది? మధ్యప్రదేశ్​పోలీసులు చెప్పేదాకా తెలంగాణ పోలీసులు గుర్తించరా?” అని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ సర్కార్ రాజకీయాల కోసం పోలీసులను వాడుకుంటున్నదని.. మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేతిలో పోలీసులు కీలుబొమ్మలుగా మారారని అన్నారు. సెక్రటేరియెట్​లోకి ప్రతిపక్ష నేతలు, ప్రజలను రానివ్వడం లేదని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ తీరు తో కేంద్ర పథకాలు తెలంగాణలో అమలు కా వడం లేదన్నారు.  ‘‘ఎస్సీ విద్యార్థులకు స్కాలర్ షిప్ లు ఇద్దామంటే, అకౌంట్ల వివరాలు పంపడం లేదు. స్వామిత్వ స్కీమ్​ అమలు చేయడం లేదు” అని ఫైర్ అయ్యారు.