రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర సర్కార్​ సహకరిస్తలేదు

రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర సర్కార్​ సహకరిస్తలేదు

సికింద్రాబాద్, వెలుగు: రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి  కేంద్రం సిద్ధంగా ఉన్నా.. రాష్ట్ర సర్కార్​ సహకరిస్తలేదని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి ఆరోపించారు. ఎంఎంటీఎస్​ రెండో దశ పనుల పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం భూకేటాయింపులు చేయడం లేదన్నారు. ఒప్పందం ప్రకారం ఈ ప్రాజెక్టు పూర్తికి రాష్ట్ర సర్కార్​ సహకారం అందించాలని.. కానీ, ఇప్పటి వరకు ప్రభుత్వం ఎంఎంటీఎస్​కు అవసరమైన భూ కేటాయింపు చేయలేదన్నారు.

దీంతో జాప్యం జరుగుతోందన్నారు. అలాగే, కాజీపేటలో రూ.384 కోట్లతో కొత్తగా రైల్వే వ్యాగన్​ పీరియాడికల్​ఓవర్​ హాలింగ్​వర్క్​షాపును కేంద్రం మంజూరు చేసిందన్నారు.150 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ వర్క్​షాపునకు రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయింపులో నిర్లక్ష్యం చేస్తోందన్నారు. అయినప్పటికీ భూసేకరణ చేశామన్నారు.  మరో రెండున్నర ఎకరాల స్థలాన్ని సేకరించాల్సి ఉందన్నారు. భూసేకరణ పూర్తికాగానే వర్క్​షాపు నిర్మాణ పనులు చేపడతామన్నారు. దీంతో సుమారు 3వేల మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని మంత్రి వెల్లడించారు.

ఆధునిక హంగులతో సికింద్రాబాద్ ​రైల్వే స్టేషన్

సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్ ​పునరాభివృద్ధి ప్రణాళికపై  సోమవారం కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి రైల్వే స్టేషన్​లో సమీక్షించారు. సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​ ఆధునిక సదుపాయాలతో, మెరుగైన నిర్మాణ డిజైన్​తో త్వరలో తెలంగాణ రాష్ట్రంలో బెస్ట్​ రైల్వే స్టేషన్​గా అవతరించనుందని వెల్లడించారు.1874లో ఏర్పాటు చేసిన ఈ రైల్వే స్టేషన్​కు రోజు రోజుకూ పెరుగుతున్న ప్రయాణికుల రద్దీతో వారికి మరింత మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు రూ.719.30 కోట్లతో ఆధునీకరిస్తున్నట్లు మంత్రి చెప్పారు. రాబోయే 40 ఏండ్ల వరకు ప్రయాణికుల  అవసరాలకు అనుగుణంగా విమానాశ్రయం తరహాలో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.

పనులు మూడు దశల్లో చేపట్టి 36 నెలల్లో అందుబాటులోకి తెస్తామన్నారు.  ప్రాజెక్టు ముఖ్య విషయాలను వివరించారు. 2023 డిసెంబరు వరకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించామన్నారు. అలాగే, సికింద్రాబాద్​– విజయవాడ స్టేషన్​ల మధ్య వందేభారత్​ రైల్​ను కూడా అందుబాటులోకి  తెస్తున్నట్లు వెల్లడించారు. మీటింగ్​లో దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్​​కుమార్​ జైన్, సీఏవో  కన్​స్ర్టక్షన్​ నీరజ్​ అగర్వాల్​, డీ ఆర్​ఎం  ఏకే గుప్తా,  మాజీ మేయర్​ బండ కార్తీకారెడ్డి,  రైల్వే మెంబర్​  వెంకటరమణి తదితరులుపాల్గొన్నారు.