
- బీజేపీ ఆఫీస్ బేరర్స్ మీటింగ్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- కాంగ్రెస్ సర్కారు చేసినకుల సర్వే రోల్ మోడల్ కాదు
- కులగణన, కులసర్వే తేడాను ప్రజలకు చెప్పాలని సూచన
హైదరాబాద్, వెలుగు: కుల సర్వేకు చట్టబద్ధత లేదని, జనాభా లెక్కలతోపాటు తీసే కులాల లెక్కలకు చట్టబద్ధత కల్పిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. కులగణన, కుల సర్వే రెండూ వేర్వేరని, వీటి మధ్య తేడాను ప్రజలకు వివరించాలని ఆ పార్టీ నేతలకు సూచించారు. ఆదివారం బీజేపీ స్టేట్‌ఆఫీస్‌లో జరిగిన ఆ పార్టీ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. కులగణన ఎలా చేస్తారన్న అంశంపై రాష్ట్ర నేతలకు కేంద్రమంత్రి వివరించారు. బ్రిటిష్‌కాలంలో చేసిన కుల గణన చేపట్టారని, ఆ తర్వాత మళ్లీ బీజేపీ మాత్రమే చేపట్టాలని నిర్ణయించిందనే విషయాన్ని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నేతలకు సూచించారు.
ఉమ్మడి 10 జిల్లాలవారీగా సమావేశాలు నిర్వహించి ఈ విషయాన్ని వివరించాలని ఆయన స్పష్టం చేశారు. అన్ని కుల సంఘాలతో విడివిడిగా సమావేశాలు నిర్వహించాలని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో సెన్సస్ చట్టానికి అమెండ్‌మెంట్ చేసి కులాల లెక్కలు తీస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన కుల సర్వే రోల్ మోడల్ కానేకాదని కిషన్ రెడ్డి అన్నారు. సమావేశంలో ఎంపీలు లక్ష్మణ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, బీజేపీ రాష్ట్ర సంస్థాగత కార్యదర్శి చంద్రశేఖర్ తివారి, ఇతర నేతలు పాల్గొన్నారు.