రూ.600 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మరింత అభివృద్ధి

రూ.600 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మరింత అభివృద్ధి

హైదరాబాద్: ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా సికింద్రాబాద్ లో నిర్వహించిన బైక్ ర్యాలీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఎర్రగడ్డ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది.  దారి పొడవునా త్రివర్ణ పతాకాలతో పెద్ద ఎత్తున ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న కిషన్ రెడ్డి మాట్లాడుతూ... రాజకీయాలకు అతీతంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరు తమ ఇండ్లు, ఆఫీసులపై, వాహనాలకు మువ్వన్నెల జండాను కట్టి ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో రూ.600 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను మరింత అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. అలాగే రాఖీ పండగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.