పార్టీ జెండాలు పాతి.. డబ్బులు వసూల్ చేస్తున్నరు

పార్టీ జెండాలు పాతి.. డబ్బులు వసూల్ చేస్తున్నరు
  • రాష్ట్రంలో ఎక్కడా చూసినా స్కామ్​లే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

సికింద్రాబాద్, వెలుగు : ‘‘బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిని ప్రజల్లో ఎండగట్టాలి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా స్కామ్​లే జరుగుతున్నయ్. వాటిని ప్రజలకు వివరించాలి. హైటెక్ సిటీ ఏరియాలో ముగ్గు వేసిన స్థలాల్లో బీఆర్ఎస్​ పార్టీ లీడర్లు జెండాలు పాతి వసూళ్లకు పాల్పడుతున్నరు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి ఆఫీస్ ఉంది. అయినా, కొత్తగా 11 ఎకరాల్లో మళ్లీ ఆఫీస్​ కడుతున్నరు. ఇది కేవలం పార్టీ ఆఫీస్​ల పేరుతో తక్కువ ధరకు భూములను కబ్జా చేయడమే..”అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.

మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా సికింద్రాబాద్, సనత్​నగర్, అంబర్​పేట్, నాంపల్లి నియోజవర్గ బీజేపీ సంయుక్త మోర్చాల సమ్మేళనాల్లో కిషన్​ రెడ్డి చీఫ్​ గెస్ట్​గా హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ లీడర్ల అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోయిందన్నారు. ప్రజా సంక్షేమం కోసం ప్రధాని మోడీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు బీఆర్ఎస్ అవినీతిని ప్రజలకు వివరించాలని సూచించారు. 

అగ్ర దేశాల సరసన ఇండియా

ప్రధాని మోడీ సమర్థ, దూరదృష్టిగల నేత అని కిషన్​రెడ్డి అన్నారు. సమాజంలో వెనుకబడిన, అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం బీజేపీ ప్రభుత్వం అంకిత భావంతో పని చేస్తున్నదని తెలిపారు. దేశంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి పరుస్తూ అగ్రదేశాల సరసన నిలబెట్టే ప్రయత్నం చాలా వేగంగా జరుగుతున్నదన్నారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో డివిజన్, బూత్ స్థాయి మీటింగ్​లు ఏర్పాటు చేయాలని సూచించారు. కేంద్రం, రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మాజీ మేయర్ బండ కార్తీకారెడ్డి, బీజేపీ లీడర్లు శ్యాంసుందర్ గౌడ్, సారంగపాణి, హరి, వీరన్న, శారదా మల్లేశ్, రాము, నాగేశ్వర్ రెడ్డి తదితరులు  పాల్గొన్నారు.