గజ్వేల్ నీ జాగీరా? .. కేసీఆర్​పై కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి ఫైర్​

గజ్వేల్ నీ జాగీరా?  .. కేసీఆర్​పై కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి ఫైర్​
  • బీజేపీ నేతలు అక్కడికి వెళ్లకుండా  ఎందుకు అడ్డుకుంటున్నవ్?
  • నిజంగానే అభివృద్ధి చేస్తే భయమెందుకు? 
  • గతంలో కాంగ్రెస్ ది కమీషన్ల ప్రభుత్వం.. 
  • ఇప్పుడు బీఆర్ఎస్​ది వాటాల ప్రభుత్వమని కామెంట్ 
  • నేను పార్టీ మారట్లే.. దుబ్బాక నుంచే పోటీ: రఘునందన్ 
  • బీజేపీలోకి జహీరాబాద్ కాంగ్రెస్ నేతలు 

హైదరాబాద్, వెలుగు: గజ్వేల్ ఏమైనా కేసీఆర్ జాగీరా? అని బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ‘‘కేసీఆర్.. గజ్వేల్ నీ జాగీరా? నిజాం రాసిచ్చిండా.. లేక ఒవైసీ రాసిచ్చిండా? అదేమైనా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా? అక్కడికి వెళ్లకుండా బీజేపీ నేతలను ఎందుకు అడ్డుకుంటున్నవ్. నీకెందుకు ఇంత బరితెగింపు” అని మండిపడ్డారు. ‘‘ఇతర రాష్ట్రాల నేతలొస్తే, బస్సుల్లో తీసుకెళ్లి మరీ గజ్వేల్ ను చూపిస్తున్నారు. అదే మేం చూస్తామంటే మాత్రం అడ్డుకుంటున్నారు. నిజంగానే మీరక్కడ అభివృద్ధి చేసి ఉంటే, ఎందుకంత భయపడుతున్నారు?” అని ప్రశ్నించారు. 

శనివారం పార్టీ స్టేట్ ఆఫీసులో కిషన్ రెడ్డి సమక్షంలో జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. ‘‘గజ్వేల్ లో నిజంగానే అభివృద్ధి జరిగిందా?  అక్కడ రైతు ఆత్మహత్యలు లేవా? దళితులందరికీ దళిత బంధు వచ్చిందా? పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చారా? ఒకవేళ​అదే నిజమైతే, అక్కడికి మేం వెళ్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారు. మీరు చేసిన అభివృద్ధిని చూస్తామంటే ఎందుకు భయపడుతున్నారు” అని కేసీఆర్ ను ప్రశ్నించారు. ‘‘చలో గజ్వేల్ కు పిలుపునిచ్చిన బీజేపీ కామారెడ్డి నాయకుడు వెంకటరమణ రెడ్డిని అరెస్ట్ చేసి నిజామాబాద్ జిల్లా మొత్తం తిప్పారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాగే కక్షపూరితంగా, దౌర్జన్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదు” అని హెచ్చరించారు. 

గజ్వేల్ కు వెళ్తామంటే అరెస్టు చేస్తరా?: రఘునందన్ 

తాను పార్టీ మారుతున్నట్టు ప్రచారం జరుగుతోందని, కానీ అదంతా అబద్ధమని ఎమ్మెల్యే రఘునందన్ రావు చెప్పారు. తాను పార్టీ మారడం లేదని, మళ్లీ బీజేపీ తరఫున దుబ్బాక నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ‘‘కామారెడ్డి, గజ్వేల్ లో పోటీ చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. గత 10 ఏండ్లుగా గజ్వేల్ లో కేసీఆర్ ఏం అభివృద్ధి చేశారో చూద్దామని.. మా లీడర్ వెంకట రమణ రెడ్డి ‘ఛలో గజ్వేల్’ కు పిలుపునిచ్చారు. కామారెడ్డి నుంచి బస్సులు పెట్టి ప్రజలను గజ్వేల్ కు తీసుకెళ్తానంటే.. కేసీఆర్ కు అంత భయమెందుకు? ‘చలో గజ్వేల్’కు ముందురోజు సాయంత్రం రమణ రెడ్డిని అరెస్టు చేసి తెల్లవారుజాము వరకు రోడ్ల మీదనే తిప్పారు. చివరకు బిచ్కుంద స్టేషన్ కు తీసుకెళ్లారు. అక్కడ ఎలాంటి కేసు నమోదు చేయలేదు. గజ్వేల్ చూసేందుకు వెళ్తామంటే అరెస్టు చేస్తారా?” అని ప్రశ్నించారు. ‘‘గజ్వేల్ అభివృద్ధిని చూసేందుకు మహారాష్ట్ర రైతులకు, పీకే, ప్రకాశ్ రాజ్ కు అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడి వారికి అవకాశం ఉండదా? నిజంగా మీరు గజ్వేల్ ను అభివృద్ధి చేశారా.. లేదంటే అక్కడేమైనా చేస్తున్నారా?” అని నిలదీశారు. ‘‘ఇప్పుడంటే డేట్ చెబితే అడ్డుకున్నారు. కానీ డేట్ చెప్పకుండా వస్తాం. గజ్వేల్ అభివృద్ధిని చూస్తాం. అక్కడి బస్టాండ్ ఎలా ఉందో? డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎన్ని కట్టారో చూస్తాం” అని సవాల్ విసిరారు. అధికార పార్టీ చెప్పినట్టు విని, ఇష్టమున్నట్టు చేయొద్దని పోలీసులకు సూచించారు.

ఇస్రోకు శుభాకాంక్షలు.. 

‘ఆదిత్య ఎల్1’ ప్రయోగం సక్సెస్ అయిన సందర్భంగా ఇస్రో సైంటిస్టులకు కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మిషన్ కూడా విజయవంతమై, ఇస్రో ఖ్యాతి మరింత పెరగాలని ఆయన ఆకాంక్షించారు. కాగా, నల్గొండ జిల్లాకు చెందిన బీజేపీ నేత ఓరుగంటి రాములు రోడ్డు ప్రమాదంలో మరణించగా కిషన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా పార్టీకి ఎన్నో సేవలందించారని ప్రకటనలో పేర్కొన్నారు.  

అవినీతి ఎమ్మెల్యేలకు టికెట్లా? 

కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, బీసీలకు ఆర్థిక సాయం తదితర పథకాలు విఫలమయ్యాయని కిషన్ రెడ్డి విమర్శించారు. నాలుగున్నరేండ్లు రైతులను మోసం చేసి, ఎన్నికలొస్తున్నాయని రుణమాఫీ చేశారని మండిపడ్డారు. పేదలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు చేసిందేమీ లేదని విమర్శించారు. ‘‘రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ కమీషన్ల ప్రభుత్వంగా ఉంటే, బీఆర్ఎస్​వాటాల ప్రభుత్వంగా మారింది. ప్రభుత్వ భూములు అమ్ముతూ, అసైన్డ్ భూములు లాక్కుంటున్నది. బీఆర్ఎస్ మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇచ్చింది. వాళ్లందరూ రాష్ట్రాన్ని దోచుకున్నారు” అని ఫైర్ అయ్యారు. కాగా, ఈ నెల 17 నుంచి తెలంగాణ విమోచన దినోత్సవాలతో పాటు ప్రధాని మోదీ జన్మదిన వేడుకలను గ్రామాగ్రామాన నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్, జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.