
- ప్లెక్సీలు పెట్టుకుంటే దేశ్ కీ నేత కాలేరు
- రాష్ట్రాన్ని సలహాదారులకు వదిలేశారు
- రోజూ నాందేడ్కు వెళ్తే తెలంగాణ ఏం కావాలి
- ప్రధానిని విమర్శించడమే కల్వకుంట్ల కుటుంబం పని
- రైతు బంధు కంటే మా యూరియా సబ్సిడీనే ఎక్కువ
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్
దేశ్ కీ నేత అని ఫ్లెక్సీలు పెట్టించుకుంటే సీఎం కేసీఆర్ దేశానికి నేత కాలేరని, ప్రజలు గుర్తిస్తేనే అవుతారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. స్టేట్ బీజేపీ ఆఫీసులో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు కేసీఆర్ పరిస్థితి ఉట్టికెగుర లేనమ్మ ఆకాశానికెగిరిన్నట్లుందన్నారు. మహారాష్ట్రలో కొంత మంది పనికిమాలిన వాళ్లకు ఫోన్లు చేస్తూ పార్టీలో చేర్చుకుంటూ ప్రధానిని విమర్శిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కుటుంబానికి పొద్దున లేస్తే ప్రధాని మోడీని విమర్శించ డమే పనని మండిపడ్డారు.
రైతు బంధు కింద ఎకరాకు ఏటా రూ.10 వేలిస్తున్నా మని డబ్బా కొట్టుకోవడం తప్ప బీఆర్ఎస్ సర్కారు రైతులను పట్టించుకోవడం లేదన్నారు. చేతికొచ్చిన పంట వర్షానికి కొట్టుకుపోయినా రైతులకు ప్రభుత్వ సహకారం లేదని విమర్శించారు. రాష్ట్రా న్ని సలహాదులకు వదిలేసి మహారాష్ట్రలో బీఆర్ఎస్ బ్రాంచి పెట్టుకోవడం ఏంటని, ఇక్కడి రైతులు, యువకులు ఏం కావాలని ప్రశ్నించారు. ప్రగతిభవన్ బుల్లెట్ ప్రూఫ్ అద్దాల నుంచి కేంద్రం మీద రాళ్లు వేస్తే అవి మీ మీదే పడతాయని చురకంటించారు. కేసీఆర్ రోజూ చెప్పే రైతు బంధు కంటే తామిచ్చే ఎరువుల సబ్సిడీయే ఎక్కువని, ఎకరాకు ప్రతి ఏటా రూ. 18 వేల 254 ఇస్తున్నామని తెలిపారు. తామిచ్చే ఎరువుల సబ్సిడీ కౌలు రైతులకు కూడా అందు తోందని, కేసీఆర్ రైతు బంధు ధనికులకు మాత్రమే అందుతోందన్నారు.
రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ ఓపెనింగ్ కు ప్రధాని వస్తే రారు కానీ పొద్దున లేస్తే నాందేడ్ కు వెళుతున్నారని విమర్శించారు. ఉచిత ఎరువలిస్తామని చెప్పి మోసం చేసి కేసీఆర్ రైతులకు వెన్నుపోటు పొడిచాడ న్నారు. మోడీ ప్రధాని అయినప్పటి నుంచి కనీస మద్దతు ధరను వంద శాతం పైగా పెంచామని చెప్పారు. బీఆర్ఎస్ గెలిచిన మొదటి రోజే దళిత సీఎం హామీని తుంగలో తొక్కి, ఇప్పటివరకు ఎన్నో హామీలిచ్చి విస్మ రించారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.