
- వేల ఏండ్ల క్రితమే ప్లాస్టిక్ సర్జరీలు చేసిన చరిత్ర మనది
- మోదీ ప్రభుత్వంలో ఆయుర్వేదానికి పూర్వవైభవం
- నేషనల్ ఆయుర్వేదిక్ కాన్ఫరెన్స్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్
హైదరాబాద్, వెలుగు: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి పట్టిపీడిస్తున్న సమయంలో మన దేశంలో140 కోట్ల ప్రజల ప్రాణాల్ని కాపాడింది ఆయుర్వేద వైద్యమే అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కరోనా టైంలో భారత్ లో కోట్ల మంది చనిపోతారని ప్రచారం చేశారని, మన దేశం గురించి హేళనగా మాట్లాడారని గుర్తుచేశారు. అయినా కూడా ప్రజలు ఆయుర్వేదాన్నే నమ్ముకున్నారని, అల్లోపతి మందులు తీసుకోలేదని మంత్రి చెప్పారు. హైదరాబాద్ లోని ఎన్ఐఎమ్ఎస్ఎస్ఈ ప్రాంగణంలో శనివారం నేషనల్ ఆయుర్వేదిక్ కాన్ఫరెన్స్ జరిగింది.
ఏన్షియంట్ ఇన్ సైట్స్ -మోడరన్ అడ్వాన్స్‌మెంట్స్’ అనే థీమ్ తో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి కిషన్ రెడ్డి హాజరై మాట్లాడారు. ప్రపంచం ఊహించలేని వైద్యవిజ్ఞానం మన దేశంలో ఉందని, వేల ఏండ్ల క్రితమే ఆపరేషన్లు చేసిన ఘన చరిత్ర మనదేనని చెప్పారు.
చరకుడు, సుశ్రుతుడు, వాగ్భటాచార్య వంటి మహానుభావులు చరకసంహిత, సుశ్రుతసంహిత గ్రంథాల ద్వారా ప్రపంచానికి మార్గదర్శకత్వం చేశారు. సుశ్రుతుడిని ‘ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ’ గా పిలుస్తారు. బ్రిటిష్ కాలం నుంచి ఆయుర్వేదాన్ని నిర్లక్ష్యం చేశారు. 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయుర్వేదానికి పూర్వవైభవం వచ్చింది. ప్రధాని మోదీ 2014లోనే ఆయుష్ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేశారు” అని కిషన్ రెడ్డి వివరించారు. ఆయుర్వేదాన్ని, యోగాను రాజకీయాలకు అతీతంగా ముందుతరాలకు అందించాలని కోరారు.
ఆయుర్వేద వ్యతిరేక లాబీని తిప్పికొట్టాలి...
ప్రపంచంలో ఆయుర్వేదానికి వ్యతిరేకంగా ఒక లాబీ నడుస్తోందని, బహుళజాతి, అల్లోపతి కంపెనీలు ఆయుర్వేదాన్ని అణచివేయడానికి ప్రయత్నిస్తున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. యోగా గురు బాబా రామ్ దేవ్ వంటి వారు మందులు తీసుకొచ్చినా సుప్రీంకోర్టులో కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇలాంటి సవాళ్లను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.