
- హెల్త్ కోసం బడ్జెట్ లో రూ.లక్ష కోట్లు కేటాయించాం: కిషన్ రెడ్డి
- ఢిల్లీలో ‘మైనే క్యాన్సర్ కో జీతా హూ’ పుస్తకావిష్కరణ
న్యూఢిల్లీ, వెలుగు: ఆత్మ స్థైర్యంతో క్యాన్సర్ ను జయించవచ్చని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు డాక్టర్ విజయ్ ఆనంద్ రెడ్డి రచించిన ‘ఐ యామ్ సర్వైవర్’ హిందీ అనువాదం ‘మైనే క్యాన్సర్ కో జీతా హూ’ పుస్తకావిష్కరణ గురువారం ఢిల్లీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, క్యాన్సర్ ను జయించిన క్రికెటర్ యువరాజ్ సింగ్, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించి, మాట్లాడారు." విజయ్ ఆనంద్ రెడ్డి తన 30 ఏండ్ల వైద్య వృత్తి అనుభవాన్ని పుస్తక రూపంలో తీసుకురావడం అభినందనీయం.
క్యాన్సర్ బాధితులు, వారి కుటుంబీలకు ‘మైనే క్యాన్సర్ కో జీతా హూ’ బుక్ ఎంతో ధైర్యానిస్తుంది"' అని పేర్కొన్నారు. 2022లో ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మేర క్యాన్సర్ కేసులు నమోదయ్యాయని తెలిపిన ఆయన..వారిలో 97 లక్షల మంది మరణించారని చెప్పారు. మన దేశంలో 14 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయని, ఏటా సంఖ్య పెరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. క్యాన్సర్ చికిత్సకు అవగాహన, మెరుగైన సదుపాయాలు చాలా ముఖ్యమన్నారు.
క్యాన్సర్‌పై పోరాడేందుకు కేంద్రం ఒక కాంప్రహెన్సివ్ మిషన్ ను ప్రారంభించిందన్నారు. 2025–-26 ఆర్థిక సంవత్సరంలో కుటుంబ, ఆరోగ్య సంక్షేమ రంగానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో రూ.లక్ష కోట్లు కేటాయించిందని గుర్తుచేశారు. రానున్న మూడేండ్లలో జిల్లా ఆస్పత్రుల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లను స్థాపించనున్నామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.