అంబర్‌‌ పేట సర్వీస్‌‌ రోడ్డు నిర్మాణానికి సహకరించండి..సీఎం రేవంత్‌‌ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌‌ రెడ్డి లేఖ

అంబర్‌‌ పేట సర్వీస్‌‌ రోడ్డు నిర్మాణానికి సహకరించండి..సీఎం రేవంత్‌‌ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌‌ రెడ్డి లేఖ

న్యూఢిల్లీ, వెలుగు : అంబర్‌‌పేట ఫ్లైఓవర్‌‌ కింద సర్వీస్‌‌ రోడ్డు నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి సహకరించాలని కేంద్ర బొగ్గు, గ‌‌నుల శాఖ మంత్రి కిషన్‌‌రెడ్డి కోరారు. ఈ మేరకు శుక్రవారం సీఎం రేవంత్‌‌రెడ్డికి లెటర్‌‌ రాశారు. కేంద్ర ప్రభుత్వం రూ.265 కోట్లతో అంబర్‌‌పేట క్రాస్‌‌రోడ్డు వద్ద 1.5 కిలోమీటర్ల పొడవైన ఫ్లైఓవర్‌‌ నిర్మించిందన్నారు.

ఫ్లై ఓవర్‌‌కు అవసరమైన భూసేకరణ ఇంకా పూర్తి కాకపోవడంతో కింద సర్వీస్‌‌ రోడ్డు నిర్మాణం ఆగిపోయిందని పేర్కొన్నారు. ఈ ఫ్లైఓవర్ 2018లోనే మంజూరు అయినప్పటికీ భూసేకరణ పూర్తి కాకుండా మధ్య దళారులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. భూసేకరణకు సంబంధించి రూ. 2.54 కోట్ల పరిహారాన్ని లబ్ధిదారులకు చెల్లించినప్పటికీ పనులు అడ్డుకుంటున్నారన్నారు.

ఈ విషయంపై సీఎం రేవంత్‌‌రెడ్డి చొరవ తీసుకొని, సర్వీస్‌‌ రోడ్డు నిర్మాణానికి ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరారు. ఈ మేరకు సంబంధిత జీహెచ్ఎంసీ, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ అధికారుల ద్వారా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.