ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్​కు రైల్వే శాఖ గ్రీన్​సిగ్నల్..సర్వే కోసం రూ.14 కోట్ల కేటాయింపు :కిషన్ రెడ్డి

ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్​కు రైల్వే శాఖ గ్రీన్​సిగ్నల్..సర్వే కోసం రూ.14 కోట్ల కేటాయింపు :కిషన్ రెడ్డి
  • భూసేకరణ చేసి కేంద్రానికి అప్పగిస్తే టెండర్లు పిలుస్తాం
  • రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయొద్దు
  • కేంద్రం నిధులతోనే యాదాద్రి వరకు ఎంఎంటీఎస్
  • రూ.330 కోట్లు కేటాయించనున్నట్లు వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు: రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్)కు అనుబంధంగా ఔటర్ రింగ్ రైల్ (ఓఆర్ఆర్) ప్రాజెక్ట్​కు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. సర్వే కోసం రూ.14కోట్లు కేటాయించినట్లు తెలిపారు. బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ట్రిపుల్ ఆర్, ఓఆర్ఆర్ వంటి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్​లతో హైదరాబాద్, సిటీ చుట్టుపక్క ప్రాంతాల ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల్లో సానుకూల మార్పులు వస్తాయన్నారు. 

 హైదరాబాద్ నలువైపులా ఉన్న రైల్వే లైన్లను కలుపుతూ ఔటర్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు రైల్వే కనెక్టివిటీ లేని ప్రాంతాలకు కొత్త రైల్వే సదుపాయం లభిస్తుందని చెప్పారు. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ కోసం భూసేకరణ చేసి కేంద్రానికి అప్పగిస్తే టెండర్ల ప్రక్రియ ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే భూసేకరణ చాలా ఆలస్యంగా సాగుతుందన్నారు. భూమి కోల్పోయిన చాలా మంది రైతులకు స్టేట్ గవర్నమెంట్ నష్టపరిహారం అందించలేదని తెలిపారు. 

యాదాద్రి వరకు ఎంఎంటీఎస్..

కరీంనగర్ – హసన్​పర్తి మధ్య 61 కిలో మీటర్ల రైల్వే లైన్ సర్వే కోసం రూ.1.50 కోట్లు కేటాయించినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ రెండో ఫేజ్ పనులను సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టనున్నట్లు తెలిపారు. దాదాపు 33 కిలో మీటర్లు రైల్వే లైన్​ను రూ.330 కోట్లతో చేపట్టనున్నట్లు వెల్లడించారు. ముందుగా నిర్ణయించుకున్న విధంగానే మూడింట రెండొంతుల ఖర్చును రాష్ట్రం భరించాల్సిన ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా రిలీజ్ చేయని కారణంగా ప్రాజెక్ట్ లేట్​ అవుతున్నదని  తెలిపారు. తెలంగాణ ప్రజలు, భక్తుల సౌకర్యార్థం మొత్తం ఖర్చు కేంద్రమే భరించేందుకు సిద్ధమైందన్నారు.

యుటిలైజేషన్ సరిఫికెట్లు ఇస్తే  మిగిలిన నిధులిస్తాం..

రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి ప్రత్యేక సహాయ పథకంలో భాగంగా తెలంగాణకు 2023–24 ఏడాదికిగాను రూ.2,102 కోట్లను కేంద్రం మంజూరు చేసిందని కిషన్​రెడ్డి తెలిపారు. 2020 – 21 నుంచి 2023 – 24 వరకు తెలంగాణకు రూ.5,221.92 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. ఇందులో దాదాపు రూ.4,141 కోట్లు రిలీజ్ చేశామని, వీటికి యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇస్తే బ్యాలెన్స్ అమౌంట్ కేంద్రం విడుదల చేస్తుందని తెలిపారు. అత్యాధునిక వ్యాధి నిర్ధారణ సౌకర్యాలతో కూడిన నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్​సీడీసీ) కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు గతంలోనే కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. అయితే, జినోమ్ వ్యాలీలో ఈ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన భూమిని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటిదాకా బదలాయించలేదని తెలిపారు. 

అధ్యక్ష మార్పు మీడియా సృష్టే

బీజేపీ రాష్ట్ర అధ్యక్ష మార్పు విషయంలో కార్యకర్తల్లో ఎలాంటి గందరగోళం లేదని, ఇదంతా మీడియా సృష్టియించిన గందరగోళమేనని కిషన్ రెడ్డి అన్నారు. అసలు అధ్యక్ష మార్పు అంశం అధిష్టానం దృష్టిలో లేదని, పార్టీలో కూడా చర్చలేదని తేల్చి చెప్పారు. అసలు ఇలాంటి ఎందుకు సృష్టిస్తున్నారో తెలియదన్నారు. బీజేపీలో చేరికలు ఆగిపోలేదని, ఒకరిద్దరు ఇతర పార్టీలో చేరినంత మాత్రానా నష్టమేమీ లేదన్నారు.