అగ్నిపథ్ కంపల్సరీ స్కీం కాదు

అగ్నిపథ్ కంపల్సరీ స్కీం కాదు
  • అగ్నిపథ్ వాలంటరీ స్కీం
  • ఇష్టమున్న వాళ్లే అగ్నిపథ్ లో చేరొచ్చు
  • చాలా దేశాల్లో అగ్నిపథ్ లాంటి స్కీమ్స్
  • పథకం ప్రకారమే సికింద్రాబాద్ అల్లర్లు
  • అభ్యంతరాలుంటే చర్చించాలె

హైదరాబాద్: అగ్నిపథ్ వాలంటరీ స్కీం అని, అందులో చేరేందుకు ఎలాంటి బలవంతం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆర్మీ అభ్యర్థులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా... నిరసనకారులు విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... అగ్నిపథ్ కు వ్యతిరేకంగా కొంత మంది కుట్రపూరితంగా ఆందోళన చేపట్టారని ఆరోపించారు. స్టేషన్ ప్లాట్ ఫామ్స్, ట్రెయిన్స్, ఇతర ఆస్తులను ఆందోళనకారులు ధ్వంసం చేశారన్నారు. షాపులను లూటీ చేశారని, ఆందోళనకారుల దాడులతో ప్రాసింజర్లు సామాన్లు వదిలేసి ప్రాణభయంతో పారిపోయిన పరిస్థితి నెలకొందని చెప్పారు. ఇది ఏమాత్రం అమోదయోగ్యం కాదని, చాలా దురదృష్టకరమని  వాపోయారు. స్కీంపై ఏమైనా అభ్యంతరాలుంటే ప్రజాస్వామ్యబద్దంగా చర్చించాలని మంత్రి సూచించారు. 

అగ్నిపథ్ స్కీం ఒకరికి వ్యతిరేకం కాదు... మరొకరికి అనుకూలం కాదన్నారు. అగ్నిపథ్ కంపల్సరీ స్కీమ్ కాదని, ఇష్టమున్న వాళ్లే ఇందులో తాత్కాలిక ప్రాతిపదికన జాయిన్ కావొచ్చన్నారు. ఆర్మీలో కొంత కాలం పాటు పని చేశాక... మళ్లీ బయటకి వచ్చి వేరే ఉద్యోగాలు చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. ఇలాంటి స్కీమ్స్ చాలా దేశాల్లో ఉన్నాయని, దేశ రక్షణకు సంబంధించి భారత్ కూడా ఈ స్కీంను చేపట్టిందని మంత్రి వెల్లడించారు.  ఉదయం నుంచి నిరసనకారులు విధ్వంసం చేస్తోంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని మండిపడ్డారు. శాంతి భద్రతలకు ఈ స్థాయిలో విఘాతం కలుగుతున్నా... రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఫైర్ అయ్యారు. ఆందోళనను కట్టడి చేయాల్సిన రాష్ట్ర మంత్రులు... సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ రెచ్చకొడుతున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని ఆందోళనను ఆపాలని కోరారు. సమగ్రమైన దర్యాప్తు చేసి ఆందోళనకు కారణమైనవారిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.