జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ ప్రభావం లేదు: కిషన్ రెడ్డి

జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ ప్రభావం లేదు: కిషన్ రెడ్డి
  • జూబ్లీహిల్స్​లో బీఆర్ఎస్ ​ప్రభావం లేదు: కిషన్​రెడ్డి
  •     ఈ సారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నరు
  •     ఒక్క కాల్ చేస్తే సమస్యలు తీర్చేందుకు ముందుంటానని వెల్లడి 
  •     ఎర్రగడ్డలో ఇంటింటి ప్రచారం చేసిన కేంద్ర మంత్రి

హైదరాబాద్/ జూబ్లీహిల్స్, వెలుగు: ఉప ఎన్నిక జరుగుతున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభావం కొంచెం కూడా లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్​ను ప్రజలు ఏమాత్రం నమ్మే పరిస్థితిలో లేరని, ఈ సారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారని తెలిపారు. జూబ్లీహిల్స్ చుట్టుపక్కల నియోజకవర్గాలు అభివృద్ధి చెందాయనీ, కానీ ఇక్కడ మాత్రం అభివృద్ధి జరగలేదన్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డ డివిజన్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ కు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు.

 జూబ్లీహిల్స్ ప్రజలు గూండాయిజాన్ని, రౌడీయిజాన్ని అంగీకరించబోరని చెప్పారు. ఏమైనా సమస్య ఉందని ఒక్క ఫోన్ కాల్ చేస్తే సమస్యలను తీర్చేందుకు ముందుంటానని చెప్పారు. ఎంపీగా తాను నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశానన్నారు. తమ నిజాయితీయే.. తమ పార్టీని గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద నేషనల్ డిజాస్టర్ ఫండ్(ఎన్​డీఎఫ్)​ ఉందని, అందులో రూ.400 నుంచి రూ.500 కోట్లు వరకు నిధులు ఉన్నాయని తెలిపారు. తుపాన్ తో నష్టపోయిన ప్రతి ఒక్కరికీ కేంద్ర ఇచ్చిన ఈ నిధుల నుంచి నష్ట పరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే మంత్రిగా ప్రమాణం చేసిన అజారుద్దీన్ ధీరుడు, వీరుడైతే ఇన్నాళ్లు ఎందుకు గుర్తుకురాలేదని ప్రశ్నించారు.

డిస్కంలను అప్పుల ఊబిలోకి నెట్టిన బీఆర్ఎస్

గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని డిస్కంలను అప్పుల ఊబిలో నెట్టేసిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. దీంతో రాష్ట్రంలో పవర్ జనరేషన్ కంపెనీలు దివాళా తీసే స్థితికి చేరుకున్నాయని అన్నారు. సింగరేణికి బకాయిపడిన రూ.42 వేల కోట్లను చెల్లించడంపై రాష్ట్ర సర్కార్ దృష్టిపెట్టాలని సూచించారు. తెలంగాణకు 40 వేల పీఎం కుసుమ్ సోలార్ పంపుసెట్లను అందించామని తెలిపారు. అలాగే 50 వేల సోలార్ రూఫ్ టాప్ లు కావాలని కేంద్రాన్ని కోరగా వాటిని అందించేందుకు కేంద్రం అంగీకరించిందన్నారు. ఎన్టీపీసీలో 4వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ లో 80 శాతం విద్యుత్ ను తెలంగాణకు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎన్టీపీసీ ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ ను తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి కోరారు. డిస్కంలను ప్రైవేటీకరించాలనే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదని తెలిపారు.