
- ప్రైవేటు కంపెనీలకు బొగ్గు బ్లాకులను ఇవ్వొద్దని టీఆర్ఎస్ అంటున్నది
- మరి జెన్‌కోకు కేటాయించిన బొగ్గు గనిని ప్రైవేటుకు ఎట్లిచ్చారని ప్రశ్న
- తాడిచర్ల మైన్‌లో రూ. 20 వేల కోట్ల కుంభకోణం: వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, వెలుగు: సింగరేణిని ప్రైవేటీకరించడం లేదని, ఇది కల్వకుంట్ల కుటుంబం చేస్తున్న అసత్య ప్రచారమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఈ విషయంలో ప్రధాని ఇప్పటికే స్పష్టత ఇచ్చారని చెప్పారు. అభద్రతా భావంతో ఉన్న కేసీఆర్.. రాజకీయ ప్రయోజనం కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్ రెడ్డితో కలిసి మీడియాతో కిషన్‌రెడ్డి మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి కంపెనీని కల్వకుంట్ల అధికారిక కంపెనీగా మార్చేశారు. సంస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సింగరేణి కార్మికులకు హామీలు ఇచ్చి.. వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేశారు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్ల ఏర్పాటు, కార్మికుల బిడ్డలకు ఉద్యోగాలు, కాంట్రాక్టు కార్మికుల రెగ్యులరైజేషన్ తదితర హామీలు ఇచ్చి మొండి చేయి చూపింది కేసీఆర్ కాదా?” అని నిలదీశారు.
మరి ప్రైవేటుకు మీరెట్లిచ్చిన్రు
‘‘తాడిచర్లలో నాణ్యమైన బొగ్గు లేదని, అక్కడ 48 మిలియన్ టన్నుల బొగ్గు మాత్రమే ఉందని రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు నివేదికలు ఇచ్చింది. కానీ అక్కడ 80 మిలియన్ టన్నుల బొగ్గు ఉన్నట్లు తేలింది. తాడిచర్ల బ్లాకులో బొగ్గు ఉత్పత్తికి రూ.3,500 నుంచి రూ.4,000 వరకు చెల్లించేలా ఏఎంఆర్ ప్రైవేట్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు” అని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ‘‘జెన్‌కోకు కేటాయించిన బొగ్గు గనిని ఏఎంఆర్ సంస్థకు కట్టబెట్టారు. గని నుంచి కేటీపీపీకి కన్వేయర్ బెల్టు ద్వారా బొగ్గును తరలించాలని ఒప్పందం చేసుకున్న ప్రభుత్వం.. రూట్ మార్చి రోడ్డు మార్గంలో లారీల ద్వారా తరలించడంతో జెన్కో మీద భారం పడుతున్నది. ఆ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్న విషయం ఇక్కడ స్పష్టమైంది” అని కిషన్ రెడ్డి ఆరోపించారు.
ప్రైవేటు కంపెనీలకు బొగ్గు బ్లాకులను కేటాయించవద్దంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం.. జెన్‌కోకు కేటాయించిన బొగ్గు గనిని ప్రైవేటుకు ఇచ్చిందని.. మరి దీన్ని ఏమంటారని ప్రశ్నంచారు. ‘‘ఉమ్మడి రాష్ట్రంలో రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు తాడిచర్ల బొగ్గు గనిని సింగరేణికి కేటాయిస్తే.. బొగ్గు వెలికితీతను ప్రభుత్వం ప్రారంభించలేదు. ప్రభుత్వం సింగరేణి మీద ఒత్తిడి తెచ్చి.. ‘తాడిచర్ల మాకొద్దు.. మేం చేయలేం’ అని సింగరేణి ద్వారా ఆ బొగ్గు గనిని కేంద్రానికి సరెండర్ చేసింది. తిరిగి ఆ బొగ్గు గనిని కేంద్రం 2015లో తెలంగాణ జెన్‌కోకు కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ స్టేజ్ 2 కోసం కేటాయించింది. మరి ఈ గనిని జెన్కో.. ఏఎంఆర్ అనే ప్రైవేట్ కంపెనీకి 25 ఏండ్ల కాంట్రాక్టు ఎందుకివ్వాల్సి వచ్చింది.. దీనికి కేసీఆర్ ఏం జవాబు చెబుతారు” అని కిషన్ రెడ్డి నిలదీశారు.
అన్ని రాష్ట్రాలు సమానమే
గుజరాత్ అయినా.. తెలంగాణ అయినా.. అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలన్నదే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని కిషన్‌రెడ్డి అన్నారు. ‘‘దేశంలో విపరీతమైన బొగ్గు కొరత, విద్యుత్ కోతలు ఉండడంతో దీన్ని అధిగమించేందుకు కేంద్రం 2020 జూన్ 20న ఓ నిర్ణయం తీసుకుంది. ఏ కోల్‌మైన్ అయినా సరే అది ప్రైవేటు గానీ, పబ్లిక్ సెక్టార్ గానీ వేలంలోనే గనులు కేటాయించాలి. యూపీఏ హయాంలో ప్రతిపాదించిన నిర్ణయం మేరకు 5 బొగ్గు గనులను గుజరాత్‌కు, రాజస్థాన్‌కు కేటాయించారు. 2015లో తెలంగాణకు కూడా సింగరేణికి 3 బొగ్గు గనులను కేటాయించారు.
వీటిలో పెనగడప్ప, న్యూ పట్రపార కోల్‌బ్లాకులను సింగరేణి సంస్థ వెనక్కి ఇచ్చింది. నైని బొగ్గు గనిలో తవ్వకాలు చేపట్టకున్నా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బొగ్గు తవ్వకాలకు కావాల్సిన అన్ని రకాల అనుమతులు పొందేందుకు రాష్ట్ర సర్కార్‌కు సాయం చేసింది. ప్రపంచంలో బొగ్గు ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో భారత్ 4 వ స్థానంలో ఉన్నప్పుడు.. బొగ్గు ఎగుమతి చేసే విషయంలో అతి పెద్ద దేశంగా ఎందుకు ఉండకూడదని ప్రధాని మోడీ భావించారు. అందుకే 2020 జూన్18న కమర్షియల్ మైనింగ్‌ను కేంద్రం ప్రారంభించింది” అని కిషన్‌రెడ్డి చెప్పారు.
తాడిచర్ల మైన్ అవినీతిపై పోరాడుతం: వివేక్ వెంకటస్వామి
తాడిచర్ల మైన్‌లో రూ.20 వేల కోట్ల కుంభకోణం జరిగిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ‘‘తాడిచర్ల మైన్ పెద్ద కుంభకోణం. సింగరేణి సంస్థతో తప్పుడు రిపోర్టులు రాయించుకొని, తాడిచర్లను ఏఎంఆర్ అనే ప్రైవేటు కంపెనీకి కట్టబెట్టారు. అందులో కల్వకుంట్ల కుటుంబానికి వాటా ఉంది” అని చెప్పారు. దీనిపై విచారణ జరిపి ఈ కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
సింగరేణి సంస్థను ప్రైవేటీకరించబోమని ఇటీవల రామగుండం పర్యటనలో ప్రధాని మోడీ స్పష్టం చేసిన విషయాన్ని వివేక్ గుర్తు చేశారు. 51 శాతం వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని ప్రైవేటీకరణ చేయగలదన్నారు. కేవలం రాజకీయం కోసమే సింగరేణి ప్రైవేటీకరణ అనే అసత్య ప్రచారాలను టీఆర్ఎస్ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చేస్తున్నారని విమర్శించారు. తాడిచర్ల మైన్‌లో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ తరఫున పోరాటం చేస్తామన్నారు.
గులాబీ కామెర్లు
‘‘గులాబీ కామెర్ల వారికి.. అంతా గులాబీనే కనిపిస్తదట. ‘గుజరాత్‌కు ఒక నీతి.. మాకో నీతినా?’ అని టీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరి సిద్దిపేటకో నీతి.. దుబ్బాకకు ఒక నీతా? సిరిసిల్లకు ఒకనీతి.. కల్వకుర్తికి ఒక నీతా? గజ్వేల్‌కు ఒక నీతి.. హుజూరాబాద్‌కు ఒక నీతా? ” అని కిషన్‌రెడ్డి నిలదీశారు. ‘‘9 ఏండ్లుగా సెక్రటేరియెట్‌కు రాని సీఎం.. దేశంలో గుణాత్మక మార్పు తెస్తరట.. 5 ఏండ్లు మహిళా మంత్రి లేకుండా ప్రభుత్వాన్ని నడిపిన వీళ్లు.. మోడీని విమర్శిస్తారట” అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ల్యాండ్, శాండ్, మైనింగ్, డ్రగ్, లిక్కర్ మాఫియా ఎవరి చేతుల్లో ఉందో ప్రజలకు తెలుసన్నారు.