హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ మాత్రమే కాదు : కిషన్ రెడ్డి 

హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ మాత్రమే కాదు : కిషన్ రెడ్డి 

నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం గత కొన్నేళ్ల నుంచి ఆశ చూపుతుందే తప్ప ఆచరణలో మాత్రం పెట్టడం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు లేక పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జంట నగరాల్లో కనీస వసతుల్లేక పేద ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ సంస్థల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడిందన్నారు.

సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని గుడిమల్కాపూర్ ఉషోదయకాలనీలో రూ.25 లక్షల వ్యయంతో నిర్మించబోయే పార్క్, ఫుట్ పాత్ డెవలప్ మెంట్ పనులకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత శివాజీనగర్, బోజగుట్ట, గుడిమల్కాపూర్ పరిధిలో పూర్తి చేసిన సీసీ రోడ్డు, డ్రైనేజీ సిస్టమ్ ను ప్రారంభించారు.  

హైదరాబాద్ అంటే కేవలం మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ కాదన్న విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఫ్లైఓవర్ లు కట్టినంత మాత్రాన హైదరాబాద్ అభివృద్ధి కాదన్నారు. నిజమైన హైదరాబాద్ నగరం బస్తీలలో ఉందని చెప్పారు. అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని గత తొమ్మిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది గానీ, అమలు పర్చడం లేదన్నారు.