ఆర్థిక సంక్షోభంలో కేసీఆర్ సర్కార్ : కిషన్ రెడ్డి

ఆర్థిక సంక్షోభంలో కేసీఆర్ సర్కార్ : కిషన్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలను మభ్యపెట్టే విధంగా ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని చెప్పారు. కేంద్రాన్ని విమర్శించకుంటే కల్వకుంట్ల కుటుంబానికి పూటగడవదని మండిపడ్డారు. కేంద్రంపై బురద జల్లుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుతున్నారని ఆరోపించారు. నిరుద్యోగ భృతి, దళిత బంధు, డబల్ బెడ్ రూం అటకెక్కాయన్నారు. కేసీఆర్, కేటీఆర్ అవినీతి పాలన చేస్తున్నారని విమర్శించారు. ఈ బడ్జెట్లో సాహిత్యం ఎక్కువైంది, సమాచారం తక్కువైందన్నారు. మోడీ వేసుకునే బట్టల గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు.

అహంకారంతో కేసీఆర్ కుటుంబం వ్యవహరిస్తోందని.. ప్రజలు దీనిని అర్థం చేసుకోవాలని కిషన్ రెడ్డి అన్నారు. దుబ్బాక, హుజూరాబాద్, హైదరాబాద్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది కాబట్టి కేటీఆర్ సీఎం కాలేకపోయాడని వ్యాఖ్యానించారు.  ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం తమకు లేదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరాక జాతిరత్నాలు అయ్యారా అని ప్రశ్నించారు. ఆ జాతిరత్నాలను 100కోట్లు ఇచ్చి బీజేపీలోకి పంపినా తీసుకోమన్నారు.రానున్న ఎన్నికల్లో ప్రజలు అవినీతి,కుటుంబం పాలనకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పారు.