మునుగోడు ప్రజలు పైసలకు అమ్ముడుపోరు : కిషన్ రెడ్డి

మునుగోడు ప్రజలు పైసలకు అమ్ముడుపోరు : కిషన్ రెడ్డి

బీజేపీ వల్లే  సీఎం కేసీఆర్ ఒక గ్రామానికి ఇంచార్జ్గా మారాడని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రభుత్వ కార్యక్రమాలను ఆపేసి.. మునుగోడులోనే మకాం వేశారని విమర్శించారు. వందల కోట్లు ఖర్చు పెట్టిన హుజురాబాద్, దుబ్బాకలో టీఆర్ఎస్ గెలవలేదన్నారు. మార్కెట్లో గొర్రెలను కొన్నట్టుగా టీఆర్ఎస్.. ఇతర పార్టీల నేతలను కొంటున్నారని కానీ మునుగోడు ఓటర్లు అలా అమ్ముడుపోరని వ్యాఖ్యానించారు. మునుగోడు మండలం చల్మెడ గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

కేసీఆర్ కుటుంబానికి మంత్రులు, ఎమ్మెల్యేలు బానిసలుగా మారారని కిషన్ రెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ నిర్మూలన కోసం కేంద్రం 800 కోట్లు ఇచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో అసైన్డ్, బంజరు భూములు కనిపిస్తే టీఆర్ఎస్ నాయకులు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. బతికున్న వారికి సమాధులు కట్టడం టీఆర్ఎస్ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని టీఆర్ఎస్ బొందపెట్టాలనుకుంటే..కేంద్ర ఎన్నికల సంఘం కాపాడిందన్నారు. 

అధికారులు టీఆర్ఎస్ ఒత్తిడికి తలొగ్గితే తిప్పలు తప్పవని కిషన్ రెడ్డి హెచ్చరించారు. ఎనిమిదేళ్లుగా సచివాలయానికి వెళ్లని ఏకైక సీఎం.. కేసీఆర్ మాత్రమేనని విమర్శించారు. రాష్టంలో జరిగే అన్ని అక్రమాలకు ప్రగతి భవన్ అడ్డాగా మారిందన్నారు. రాష్టంలో భూములను వదిలిపెట్టడంలేదని.. బీజేపీ వచ్చాక అవన్నీ కక్కిస్తామన్నారు. పార్టీ గెలుపుకు ప్రతీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.