- కొత్త బ్లాకులు సాధించాలే, లేబర్కోడ్స్ అమలు చేయాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: మార్కెట్ లో పోటీని తట్టుకొని నిలబడాలంటే దానికి తగ్గట్లుగా పోరాడాలని, బొగ్గు ధరలు తగ్గించడంతో పాటు కొత్త బ్లాకులు సాధించుకోవాలని సింగరేణి అధికారులకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి సూచించారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఇకపై అంకితభావంతో పనిచేయాలని, లేదంటే వాటిని ఎవరూ రక్షించలేరని హెచ్చరించారు.
శనివారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో సంస్థపై కేంద్ర మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ముందుగా సింగరేణి సంస్థ చైర్మన్, సీఎండీ ఎన్.బలరాం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సంస్థకు సంబంధించిన ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్తు వ్యూహాలను వివరించారు. అంశాల వారీగా పలు సమస్యలపైన కిషన్ రెడ్డి, కేంద్ర బొగ్గు శాఖ ఉన్నతాధికారులు చర్చించారు.
అనంతరం కిషన్రెడ్డి మాట్లాడుతూ సింగరేణి భవిష్యత్ కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి నివేదిక ఇవ్వాలని ఆఫీసర్లను ఆదేశించారు. బొగ్గు రంగంలో తాము కొన్ని సంస్కరణలు తీసుకురాబోతున్నామని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కొత్త లేబర్కోడ్స్ అమలులోకి తీసుకొచ్చామన్నారు. వాటిని పటిష్టంగా అమలు చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు.
సింగరేణిలో కార్మికుల సంక్షేమం విషయంలో రాజీపడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అదే సమయంలో మానవ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. కొత్త బ్లాకులను సాధించడం కోసం ప్రణాళిక బద్ధంగా పనిచేయాలన్నారు.
సింగరేణి సంస్థ బొగ్గు నాణ్యత పెంపుదలకు వాషరీలను ఏర్పాటు చేయాలని, డ్రై వాషరీలను కూడా ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ఈ సమీక్షలో బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి విక్రమ్ దేవ్ దత్త్, తెలంగాణ ఇంధన శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, సింగరేణి సంస్థ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
