అమెరికా టూర్​కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

అమెరికా టూర్​కు కేంద్రమంత్రి  కిషన్ రెడ్డి

అమెరికా టూర్​కు కిషన్ రెడ్డి

అంతర్జాతీయ హై లెవల్ పొలిటికల్ ఫోరమ్ సదస్సుకు ఇయ్యాల హాజరు

జీ-20 దేశాల టూరిజం గ్రూప్ చైర్ హోదాలో ప్రసంగం

హైదరాబాద్, వెలుగు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బుధవారం అమెరికా వెళ్లారు. న్యూయార్క్‌‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ ‘హై లెవల్ పొలిటికల్ ఫోరమ్ (హెచ్‌‌ఎల్‌‌పీఎఫ్)’ ఆధ్వర్యంలో జరగనున్న సమావేశంలో ఆయన ప్రధాన వక్తగా ప్రసంగించనున్నారు. ఈ నెల 13, 14 తేదీల్లో జరగనున్న ఈ సమావేశంలో ప్రపంచంలోని వివిధ దేశాల ప్రజా ప్రతినిధులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు పాల్గొంటారు. ఇప్పటివరకు ఈ అవకాశం దక్కిన తొలి భారత పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కావడం గమనార్హం. మన దేశం జీ-20 సమావేశాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో.. కేంద్ర పర్యాటక మంత్రిగా, ‘జీ-20 దేశాల టూరిజం చైర్‌‌’ హోదాలో కిషన్ రెడ్డి ఈ అంతర్జాతీయ సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 

ఇటీవల గోవాలో జీ-20 దేశాల పర్యాటక మంత్రులు, తొమ్మిది  ప్రత్యేక ఆహ్వానిత దేశాల మంత్రుల సమావేశాలు విజయవంతంగా జరిగాయి. ఈ సందర్భంగా ఇండియా చేసిన ప్రతిపాదనలను సభ్యదేశాలు, ఆతిథ్య దేశాల మంత్రులు ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో ‘పర్యాటక రంగంలో సుస్థిరాభివృద్ధి లక్షాలను చేరుకోవడం, అత్యవసర కార్యాచరణ కోసం ప్రపంచ దేశాలను, వివిధ భాగస్వామ్య పక్షాలను (వ్యాపార సంస్థలు)  ఏకం చేయాల్సిన ఆవశ్యకత’ థీమ్​తో రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. అత్యంత  ప్రాధాన్యతతో కూడిన అంతర్జాతీయ వేదికలో ప్రధాన వక్తగా కేంద్ర పర్యాటక మంత్రి హోదాలో కిషన్ రెడ్డికి అరుదైన అవకాశం రావడంతో బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సమావేశాలకు వెళ్లే ముందు కిషన్ రెడ్డి బుధవారం ఉదయం సతీసమేతంగా అంబర్​పేట మహంకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.