
హైదరాబాద్: దేశవ్యాప్తంగా కుల గణన చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. ఈ నిర్ణయం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గురువారం (మే 1) ఆయన ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కుల గణన నిర్ణయం తమ విజయంగా కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటోందని.. మరీ కుల గణన చేయాలని భావిస్తే కాంగ్రెస్ గత 60 ఏళ్లలో ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
దేశ వ్యాప్తంగా కుల గణన చేయాలని కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డికి భయపడి తీసుకున్న నిర్ణయం కాదని.. అన్ని వర్గాల సామాజిక న్యాయానికి బీజేపీ కట్టుబడి ఉన్నందుకున కుల గణన చేయాలని నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. ముస్లింలను బీసీల్లో చేర్చి కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించిన కిషన్ రెడ్డి.. కాంగ్రెస్ లాగా ముస్లింలను బీసీల జనాభాలో చేర్చి మేం మోసం చేయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలను పక్కకు పెట్టి ముస్లింలకు ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు.
Also Read : పదేళ్ల క్రితం మా నోట్లో మట్టి కొట్టారు..
స్వతంత్ర భారత దేశంలో ఇప్పటి వరకు కుల గణన జరగలేదని.. దేశాన్ని దశాబ్ధాల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ కుల గణన చేయలేదని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన మండల్ కమిషన్ ను కూడా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పక్కకు పెట్టిందని విమర్శించారు. 2011 జన గణనలో కుల గణన చేర్చాలని బీజేపీ నేత సుష్మా స్వరాజ్ ఆనాటి ప్రధానికి లేఖ రాశారని గుర్తు చేశారు.
బీసీలకు న్యాయం చేయడానికి బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందని.. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు. కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు లేకుండా కుల గణన నిర్వహించిందని.. మేం అలా కాకుండా పకడ్బందీగా క్యాస్ సెన్సెస్ చేపడతామని తెలిపారు. జన గణన సమయంలో కుల గణన చేస్తేనే సరైన లెక్కలు తేలుతాయని పేర్కొన్నారు.