
- 50 శాతం నిధులు కేంద్రానికి జమ చేయాలని సూచన
- రాష్ట్రంలో 11 ఎన్‌హెచ్‌ల కోసం భూసేకరణ చేపట్టాలని మరో లేఖ
హైదరాబాద్, వెలుగు: రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) భూ సేకరణలో రాష్ట్ర వాటా నిధులను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఏఐ) కు వెంటనే జమ చేయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బుధవారం లేఖ రాశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ‘భారతమాల పరియోజన’ కార్యక్రమం ఎన్ హెచ్ఏఐ ద్వారా రాష్ట్రంలో నిర్మించనున్న వివిధ ఎన్‌హెచ్‌లకు అవసరమైన భూసేకరణను వెంటనే చేపట్టాలని కోరుతూ రేవంత్ కు మరో లేఖ కూడా రాశారు. రూ.26 వేల కోట్ల అంచనా వ్యయంతో 350 కి.మీ.లతో చేపడుతున్న ట్రిపుల్ఆర్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ వ్యయంలో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించేలా ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలో ట్రిపుల్‌ఆర్‌లో ఉత్తర భాగం నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా చెల్లించవలసిన రూ.2,585 కోట్లను వెంటనే ఎన్ హెచ్ఏఐకి జమ చేసి పనుల ప్రారంభానికి సహకరించాలని ఆయన కోరారు. గతంలో ఎన్హెచ్ఏఐ అధికారులు చాలాసార్లు లేఖలు రాశారని, అయినప్పటికీ గత ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదని అందులో పేర్కొన్నారు. ఇదే విషయంపై గతేడాది 3 ఫిబ్రవరి 3న అప్పటి సీఎం కేసీఆర్‌కు తాను కూడా లేఖ రాసినట్లు తెలిపారు. భూసేకరణ ఆలస్యమయితే, ఆ ప్రభావం నిర్మాణ పనులపై పడుతుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకమైన చొరవ చూపించాలని సీఎం రేవంత్కు రాసిన లేఖలో కోరారు.
ఎన్‌హెచ్‌లకు భూసేకరణపై దృష్టి పెట్టండి
రాష్ట్రంలో 2,500 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారు(ఎన్‌హెచ్)ల ప్రాజెక్టులు వివిధ దశలలో ఉన్నాయని సీఎం రేవంత్ కు రాసిన మరో లేఖలో కిషన్ రెడ్డి తెలిపారు. అందులో రూ. 32,383 కోట్ల అంచనా వ్యయంతో 751 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న 11 ఎన్‌హెచ్ ప్రాజెక్టులు వివిధ దశలలో ఉన్నాయి. ఈ 11 జాతీయ రహదారుల ప్రాజెక్టుల నిర్మాణానికి 4,332 హెక్టార్ల భూమి (రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగంతో సహా) అవసరం ఉంది. ఈ భూమి సేకరణకు ఎన్ హెచ్ఏఐ అధికారులు గత రాష్ట్ర ప్రభుత్వానికి అనేకసార్లు లేఖలు రాశారు. ఇప్పటి వరకు 284 హెక్టార్ల భూమి సేకరణ మాత్రమే జరిగింది. ఇంకా 4,048 హెక్టార్ల భూమిని ఎన్హచ్ఏఐకి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేయాల్సి ఉందని గుర్తు చేశారు. ఈ రోడ్లు పూర్తయిలే ఆయా ప్రాంతాలలో సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక ప్రగతికి ఎంతగానో దోహద పడతాయని.. ట్రాఫిక్ సమస్యలు తొలగిపోతాయన్నారు. ఎన్‌హెచ్‌లకు అవసరమైన భూమిని కూడా రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో సేకరించినట్లయితే... ఆ ప్రాజెక్టులు కేంద్రం వేగంగా పూర్తి చేస్తుందని వివరించారు. ఇదే విషయంపై15 మార్చి, 2023 న అప్పటి సీఎం కేసీఆర్ కు నేను లేఖ రాస్తే... ఆశించిన సహకారం అందలేదన్నారు.