- సౌదీ, ఈజిప్ట్, ఒమన్, ఖతర్ మధ్యవర్తిత్వంతో సైనిక చర్యను నిలిపేసిన ట్రంప్
- తమ వద్ద అన్ని ఆప్షన్లూ ఉన్నాయని హెచ్చరిక
టెహ్రాన్/వాషింగ్టన్: ఇరాన్లో నిరసనకారులకు మరణశిక్షలు అమలు చేయడం ఆగిపోయిందని అమెరికా ప్రకటించింది. దాదాపు 800 మందికి మరణ శిక్షలు అమలు చేయాల్సి ఉండగా, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ వాయిదా వేసినట్టు వెల్లడించింది. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఈ మేరకు గురువారం మీడియాతో మాట్లాడారు. ఇరాన్ కు ఒక చాన్స్ ఇవ్వాలని, సైనిక చర్యకు దిగవద్దంటూ ట్రంప్ ను గల్ఫ్ దేశాలు (సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఒమన్, ఖతర్) కోరడం, మరణ శిక్షలను నిలిపివేస్తున్నట్టు ఇరాన్ నుంచి సమాచారం అందడంతో ట్రంప్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని ఆమె తెలిపారు.
అయితే, ట్రంప్ వద్ద అన్ని ఆప్షన్లూ సిద్ధంగా ఉన్నాయని, ఇరాన్ లో నిరసనకారుల కాల్చివేత, మరణ శిక్షలు కొనసాగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారని చెప్పారు. కాగా, ఇరాన్ లో నిరసనల్లో పాల్గొన్న దుకాణదారుడు ఎర్ఫాన్ సోల్తానీకి బుధవారం మరణ శిక్షను అమలు చేయాల్సి ఉండగా, దానిని రద్దు చేసినట్టు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ చెప్పారని సౌదీ విదేశాంగ మంత్రి ఫైజల్ బిన్ ఫర్హాన్ ఒక ప్రకటనలో తెలిపారు. బుధ, గురువారాల్లో మరణ శిక్షల అమలు ఉండబోదని ఇరాన్ ప్రకటించిందన్నారు.
దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. ఇది గుడ్ న్యూస్ అని, ఇదే కొనసాగాలని కోరుకుంటున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కాగా, ఇరాన్ పై అమెరికా గురువారం మరిన్ని ఆంక్షలు విధించింది. దీంతో ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఇరాన్ కు తాజా ఆంక్షలతో మరింత ఇబ్బందికర పరిస్థితి రానుందని భావిస్తున్నారు. కాగా, ఇరాన్ కరెన్సీ రియాల్ దారుణంగా పతనం కావడం, దేశంలో ధరలు విపరీతంగా పెరగడంతో గత నెల 28 నుంచి పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి.
ట్రంప్ వద్ద అన్ని ఆప్షన్లూ ఉన్నయ్..
ఇరాన్లో ప్రస్తుత పరిస్థితిపై చర్చించేందుకు గాను అమెరికా పిలుపు మేరకు గురువారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు ఇరాన్ అసమ్మతివాదులతో సభలో అమెరికా రాయబారి మైక్ వాల్ట్జ్ మాట్లాడించారు. ఇరాన్ విషయంలో తమ ప్రెసిడెంట్ ట్రంప్ వద్ద అన్ని ఆప్షన్లూ సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు.
‘‘ప్రెసిడెంట్ ట్రంప్ అంతులేని చర్చలు కొనసాగించే వ్యక్తి కాదు. ఆయన చేతల మనిషి. ఆయన టేబుల్‌పై అన్ని ఆప్షన్లూ ఉన్నాయి. ఇరాన్లో మారణహోమాన్ని ఆపకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు. ఈ విషయంలో ట్రంప్ ఏం చేస్తారన్నది ఇరాన్ నాయకత్వానికే బాగా తెలుసు” అని మైక్ వాల్ట్జ్ స్పష్టంచేశారు.
