
వాన వెలిసింది. గంగవెల్లువ సాగరాల్లో బంధి అయింది. నిండు కుండల్లాంటి చెరువుల్లో చిరుగాలికి తొణికిసలాడే అలలపై బోటు అలా అలా కదిలి పోతుంది. ఉత్సాహంగా, హ్యాపీగా సాగిపోయే ప్రయాణం ఆరు నెలల లాక్ డౌన్ నుంచి మంచి రిలా క్సేషన్ ఇస్తుంది. చెరువుల చుట్టూ కొండలు, నదుల పొడవునా అడవులు ఇప్పుడు కనువిందు చేసే దృశ్యాలు. తెలంగాణ సిగలోని జలసిరులపై ఓ కన్నేద్దాం. జలాశయాలపై షికారు చేస్తూ మూడు అందాలను ముచ్చటగా చూసొద్దాం.
దుర్గం చెరువు
దుర్గం చెరువుని సీక్రెట్ లేక్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడిక్కడ సీక్రెట్ ఏమీ లేదు. అంతా ఓపెన్. చుట్టూ ఉండే గుట్టలపై మేడలు లేచినై. గుట్టల్ని కలుపుతూ వచ్చిన తీగల వంతెన చెరువుని దాటిస్తోంది. ఈ విచి త్రం చూసేందుకు వచ్చే జనంతో సీక్రెట్ లేక్ అందాలన్నీ బహిరంగమే. రంగురంగుల లైట్లతో వెలిగిపోయే వంతెన, దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నట్లే కనిపించే ఐటీ కంపెనీల అద్దాల మేడల అందాలు చూడాలంటే ఈవెనింగ్ కరెక్ట్ టైమ్. ఈ చెరువులో బోటింగ్ చేస్తూ జంగిల్ని, కాంక్రీట్ జంగిల్ని దగ్గరగా చూడొచ్చు.
నిజాం సాగర్
మంజీరా నదిపై నిర్మించిన నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఇప్పుడు నిండుగా ఉంది. నిజామాబాద్ పట్టణానికి 80 కిలోమీట్లర దూరంలో (నిజాం సాగర్ గ్రామం) ఈ రిజర్వాయర్ ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి రోడ్డు సౌకర్యంఉంది. హైదరాబాద్ నుంచి 145 కిలోమీటర్ల ప్రయాణం. వానాకాలంలో ఇది నిండుగా ఉంటుంది. టూరిస్టులకు ఇది అనుకూల సమయం. బోటింగ్ చేస్తూ పచ్చని పల్లె అందాలు చూసి రావచ్చు. దీనికి దగ్గర్లోనే పోచారం, సింగూరు రిజర్వాయర్లు కూడా ఉన్నాయి. ఇప్పుడివన్నీ నిండుకుండల్ని తలపిస్తున్నాయి.
లోయర్ మిడ్ మానేర్
లోయర్ మిడ్ మానేరు నిండుగా తొణికిసలాడుతోంది. 6475 చదరపు మీటర్ల వైశాల్యంలో ఉన్న ఈ డ్యాంలో విహరించడానికి బోటింగ్ సౌకర్యం ఉంది. 27 మీటర్ల ఎత్తున ఉండే ఈ కట్టడం నుంచి ప్రవాహాన్ని కిందికి వదిలేందుకు 20 గేట్లున్నాయి. ఈ మధ్యనే ఆ వరద గేట్లెత్తారు. కరీంనగర్ నుంచి ఆరు కిలోమీటర్లు రోడ్డు మార్గంలో పోతే లోయర్ మానేరు చేరుకోవచ్చు.
కోటిలింగాల
చారిత్రక తొలియుగం నాటి తెలంగాణ ఘన చరిత్రను యాది చేసే ప్రాచీన నగరం ఇది. శాతవానుల రాజధాని ఇది. ఇక్కడ శాతవాహన కాలపు కట్టడాలెన్నో ఉన్నాయి. భారత పురావస్తు శాఖ పరిరక్షణలో ఉన్న వాటన్నింటినీ చూసి రావచ్చు. రక్షణే కాదు రవాణాకూ అనుకూలమని గోదావరి తీరంలో ఈ నగరం నిర్మించారు. ఎన్నో దేశాలతో వర్తకం నడిపి బౌద్ధానికి చేరువైనా ఈ పట్టణానికి చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ చారిత్రక అందాలతోపాటే గోదావరిలో విహరిస్తూ నదీ ప్రయాణాన్ని, అడవి సౌందర్యాన్ని ఏకకాలంలో ఆస్వాదించవచ్చు. కరీంనగర్, జగిత్యాల, మంచిర్యాల, ధర్మపురి పట్టణాల నుంచి రోడ్డు మార్గంలో కోటి లింగాల చేరుకోవచ్చు.
పాకాల చెరువు
వరంగల్ సిటీకి పడమర వైపు 50 కిలోమీటర్ల దూరంలో పాకాల చెరువు ఉంది. వరంగల్ కి దగ్గర్లో ఉండే వాళ్లు వీకెండ్స్లో విహరించానికి అనుకూలమైనది. పున్నమి రోజు రాత్రుల్లో ఈ చెరువు చాలా అందంగా ఉంటుంది. 1213లో కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు ఈ చెరువు తవ్వించిండు. 30 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్న ఈ చెరువులో విహారం ఓ మధురానుభూతి. చుట్టూ కొండలు, అడవుల మధ్య ఉండే ఈ చెరువు మంచి పిక్నిక్ స్పాట్. వరంగల్ జిల్లాలోని రామప్పచెరువులో కూడా బోటింగ్ ఉంది. రామప్పకు సమీపంలో కాకతీయులు నిర్మించిన ఆలయాలెన్నో ఉన్నాయి.
పెద్ద చెరువు
మహబూబ్ నగర్ పట్టణం మధ్యలో 98 ఎకరాల మధ్య విస్తరించి ఉన్న చెరువు ఇది. పెద్ద చెరువు ఎవరూ తవ్వింది కాదు. సహజంగా ఏర్పడిన చెరువు. రాష్ర్టంలోని చెరువులన్నింటికీ డిఫరెంట్ ఇది. చెరువులో 20 నుంచి 40 అడుగుల లోతున నీళ్లుంటాయి. తెలంగాణ టూరిజం ఏర్పాటు చేసిన బోటులో ప్రయాణిస్తూ పట్టణాన్ని చూడొచ్చు. చెరువుచుట్టూ ఉన్న ఒకటిన్నర కిలోమీటర్ల రోడ్డుపై ప్రయాణం మరో కొత్త అనుభూతి.
హుస్సేన్ సాగర్
మెడలో హారంలా చుట్టూ పచ్చని గార్డెన్స్, హారంలో ఒదిగిన మణుల్లా రంగురంగు ల ఉద్యానవనాలతో ఉన్న హుస్సేన్ సారర్ని ‘హార్ట్ ఆఫ్ హైదరాబాద్’ అనడం అతిశయోక్తి కాదేమో! హైదరాబాద్ సికింద్రాబాద్లను కలిపే ట్యాంక్ బండ్ మీద కొలువైన వైతాళికులు, హుస్సేన్ సాగర్ మధ్య అత్యంత ఎత్తైన ఏకశిలా బుద్దుని విగ్రహం, బోటింగ్ ఇక్కడ ప్రధానమైన ఆకర్షణలు. టూరిస్టులు రోజంతా గడిపేంత ఆహ్లాదం ఇక్కడ ఉంది. లుంబినీ పార్క్ నుంచి బుద్దుని విగ్రహం వరకు లాంచ్లో పోతూ హుస్సేన్ సాగర్ అందాలు చూడొచ్చు. చెరువుని చుట్టేసి రావాలంటే బోట్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న ఇందిరాపార్క్, ఎన్టీఆర్ గార్డెన్స్, లుంబినీ పార్క్, సంజీవయ్య పార్క్, చిల్ర్డన్స్ పార్క్, బటర్ ఫ్లై గార్డెన్ పార్క్, రాక్ గార్డెన్, గ్రీన్ లాన్స్ పిల్లలనే కాదు పెద్దలనూ ఆకట్టుకుంటాయి. ఓపికున్నంత సేపు లాన్స్పై నడుస్తూ, రంగుల పూల అందాలు చూస్తూ శక్తిని కూడదీసుకుని మళ్లీ నడవొచ్చు. ఎన్టీఆర్ గార్డెన్లో పిల్లల కోసం పార్కులో టాయ్ ట్రైన్ కూడా. వీకెండ్స్లో సిటీలో ఉండే వాళ్లే కాదు జిల్లాల వాళ్లు కూడా పిల్లలకు ఈ అందాలు చూపించొచ్చు. పార్కులకు, బోటింగ్కి విడివిడిగా టికెట్ తీసుకోవాలి.
లక్నవరం
కాకతీయుల కాలంలో 1312లో ఈ చెరువు తవ్వారు. ఈ చెరువులో ఆరు దీవులున్నాయి. వాటిని టూరిస్టుల కోసం అందంగా ముస్తాబు చేశారు. ఈ దీవులను కలుపుతూ ఉండే వేలాడే తీగల వంతెన అన్నింటికంటే ప్రత్యేకమైనది. ఈ తీగల వంతెనపై నడిచేందుకే ఇక్కడికి టూరిస్టులు ఎక్కువగా వస్తారు. ఆనాటి నిర్మాణాలు చూస్తే 14వ శతాబ్దం నాటికే అభివృద్ధి చెందిన సాగునీటి వ్యవస్థ ఉందని అర్థమవుతుంది. దీవుల మధ్య రాకపోకలే కాకుండా చెరువు చుట్టూ ఉన్న అందమైన ప్రకృతిని చూసి వచ్చేందుకు బోటింగ్ బాగుంటుంది.
కిన్నెరసాని
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రవహించే కిన్నెరసాని బోటింగ్తో పాటు వైల్డ్ లైఫ్కి కూడా పెట్టింది పేరు. 635 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉండే కిన్నెరసాని అభయారణ్యంలో అరుదైన వన్యప్రాణులెన్నో చూసిరావచ్చు. చిరుత పులులు ఉన్నాయి. అడవిలో గుంపులు గుంపులుగా దుంకుతూ, పరుగెత్తుతూ కనిపించే జింకలు, దుప్పులు కనువిందు చేస్తాయి. కిన్నెరసాని నదికి ఇరువైపులా ఉన్న అడవిలో అనేక పక్షి జాతులు ఉన్నాయి. బోటింగ్ చేస్తూ అడవిని, అడవి దాచిన అందాలనూ చూసి రావచ్చు. కిన్నెరసాని అభయారణ్యం పాల్వంచ పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది.
నాగార్జున సాగర్
ప్రపంచంలోనే అతిపెద్ద బహుళార్థక సాధక ప్రాజెక్ట్ అని తెలుసు. గేట్లు ఎత్తితే జలధారల అందం వార్తల్లో చూస్తున్నాం. కానీ ఈ రిజర్వాయర్ బ్యాక్ వాటర్ అందాలు మాత్రం మిస్ అవుతున్నాం. నిన్నటి వానలకు నాగార్జున సాగర్ సముద్రంలా కనిపిస్తోంది. కనుచూపు మేర నీళ్లే! కృష్ణానీటిలో విహరిస్తూ ఎంజాయ్ చేయాలనుకునే టూరిస్టులకి ఇది భలే మంచి అవకాశం. నిండుగా ఉన్న రిజర్వాయర్లో లాంచి సేవలు స్టార్ట్ అయ్యాయి. లాక్ డౌన్ తర్వాత హరితా హోటల్స్ కూడా ఓపెన్ అయ్యాయి. హరితా రెస్టారెంట్స్లో సీ ఫుడ్తోపాటు తెలంగాణ ట్రెడిషనల్ వంటలు కూడా వడ్డిస్తున్నారు. మూడు రోజులు ఉంటే తప్ప ముచ్చట తీరని ట్రావెల్ స్పాట్ ఇది. దగ్గర్లోనే బుద్ధవనం ప్రాజెక్ట్ ఉంది. బుద్దుని జీవిత విశేషాలు, బౌద్ధ సంప్రదాయాలు ఈ తరానికి తెలియజెప్పేందుకు విశాలమైన గార్డెన్స్లో అందమైన శిల్పాలతో నిర్మిస్తున్నారు. వేల ఏళ్ల క్రితం బౌద్ధాన్ని విస్తరించిన నాగార్జునుని కొండ, ఆనాటి ఆనవాళ్లు చూసి రావచ్చు. తక్కువ రెంట్, తక్కువ ఖర్చుతో మూడు రోజుల ప్యాకేజీని తెలంగాణ టూరిజం అందిస్తోంది.