
- పలు కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వడ్లు
- కుప్పకూలిన చెట్లు, కరెంట్ స్తంభాలు, పెంకుటిండ్లు
- రోడ్లపై నీరు నిలువడంతో రాకపోకలకు అంతరాయం
- నిలిచిన విద్యుత్ సరఫరా
కామారెడ్డి/నిజామాబాద్, వెలుగు : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బుధవారం వర్షం దంచి కొట్టింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురువడంతో పలు కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కుప్పలు, ఆరబోసిన వడ్లు వరదపాలయ్యాయి. ఆరుగాలం కష్టపడ్డ పంట వర్షార్పణం కావడంతో అన్నదాతలు కన్నీరుపెడుతున్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంతో పాటు, యాడారం, కామారెడ్డి మార్కెట్ యార్డు, సదాశివనగర్ మండలంలో వడ్ల కుప్పలు తడిసిపోయాయి.
ఆరబోసిన మక్కలు తడవడంతో రైతులు నష్టపోయారు. కామారెడ్డి, తాడ్వాయి, పాల్వంచ, లింగంపేట, ఎల్లారెడ్డి, నిజాంసాగర్ మండలాల్లోనూ వర్షం దంచి కొట్టింది. రోడ్లపై నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బంది కలిగింది. పలుచోట్ల చెట్లు, కరెంట్ పోల్స్ పడిపోవడంతో విద్యుత్తు అంతరాయం ఏర్పడింది. లింగంపేట మండలం అయిలాపూర్లో పాత పెంకుటిళ్లు కూలింది.
నిజామాబాద్ జిల్లాలో..
నిజామాబాద్ జిల్లాలో 741 మి.మీల వర్షపాతం నమోదైంది. వరి కోతలు ముందుగా ముగియడంతోపాటు కాంటాలు పెట్టడంతో అన్నదాతలు ఊపిరిపీల్చుకున్నారు. ప్రతి మండలంలో 22.5 మి.మీ వర్షం కురిసింది. ఆర్మూర్ లో నాలుగు గంటల పాటు కురిసిన వర్షం వల్ల కల్లాల వద్ద ఆరబెట్టిన వరి ధాన్యం తడిసింది. నవీపేట్ మండలం లో భారీ వర్షం కురువగా రోడ్లుపై గుంతల్లో నీళ్లు నిలిచి రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. సిరికొండ మండలంలోని కప్పలవాగులో నీటి వరద పారింది. తాళ్ల రామడుగు గ్రామంలో పెంకుటిళ్లు కూలింది. గడ్గోల్ చెక్ డ్యాంలోకి కొత్త నీరు చేరింది. కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి విలేజ్లోని లక్ష్మీనారాయణస్వామి ఆలయంలోకి వర్షపు నీరు చేరడంతో భక్తులు ఇబ్బందిపడ్డారు. పలుచోట్ల కరెంట్ స్తంభాలు కూలడంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.
నిజామాబాద్ జిల్లాలో నమోదైన వర్షపాతం
నిజామాబాద్ జిల్లాలో 741 మి.మీల వర్షపాతం నమోదైంది. ధర్పల్లి మండలంలో అత్యధికంగా 76.5 ఎం.ఎంల వర్షం కురిసింది. ముగ్పాల్ మండలంలో 47.4, వేల్పూర్ 41.2, నిజామాబాద్ నార్త్ 38.5, భీంగల్ 36, కోటగిరి 31.6, జక్రాన్పల్లి 30.8, ఇందల్వాయి 30.2, మోస్రా 29.7, డిచ్పల్లి 27.1, రుద్రూర్ 26.1, పోతంగల్ 26, ఆర్మూర్ 24 ఎం.ఎంల వర్షం నమోదైంది. వర్ని 23.9, మాక్లూర్ 22.8, మెండోరా 21.3, ముప్కాల్ 21.3, నవీపేట 24, చందూర్ 18.6, కమ్మర్పల్లి 17.8, నిజామాబాద్ రూరల్లో 16.8, ఆలూర్ 15, రెంజల్లో 13.7, సిరికొండ 13, ఎడపల్లి 13, బాల్కొండ 12.8, ఎర్గెట్ల 10.7, మోర్తాడ్ 9.1, నందిపేటలో 9.5 ఎం.ఎంల వర్షం కురిసింది. బోధన్ 8, సాలూరా 3.3, డొంకేశ్వర్లో 1.3 ఎం.ఎంల స్వల్ప వర్షం నమోదైంది.