సిద్దిపేట జిల్లాలో అకాల వర్షానికి 3887 ఎకరాల్లో పంట నష్టం

సిద్దిపేట జిల్లాలో అకాల వర్షానికి 3887 ఎకరాల్లో పంట నష్టం

సిద్దిపేట, తొగుట, వెలుగు: సిద్దిపేట జిల్లాలో కురిసిన అకాల వర్షానికి 3887 ఎకరాల్లో మొక్కజన్న, సన్ ఫ్లవర్ పంటలకు నష్టం వాటిల్లింది. మంగళవారం డీఏవో  స్వరూప రాణి తొగుట మండలంలో పంటలు దెబ్బతిన్న గ్రామాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. జిల్లాలోని 40 గ్రామాల్లో 1998 మంది రైతులకు సంబంధించి మొత్తం 3887 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. వీటిలో 1209 మంది రైతులకు 2356  ఎకరాల్లో మొక్కజొన్న, 789 మంది రైతులకు 1531 ఎకరాల్లో సన్ ఫ్లవర్ పంటలు దెబ్బతిన్నాయి.

అత్యధికంగా దౌల్తాబాద్ మండలం మంతూరులో 202 ఎకరాల్లో మొక్కజొన్న, తొగుట మండలం లింగాపూర్ లో 83 ఎకరాల్లో సన్ ఫ్లవర్ పంటలకు నష్టం వాటిల్లింది. దెబ్బతిన్న పంటలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి ప్రాథమిక నష్టాన్ని అంచనా వేసి కలెక్టర్ కు నివేదికను సమర్పించనున్నారు. ఈ సందర్భంగా డీఏవో  క్షేత్ర స్థాయిలో పంటనష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికను పంపుతామని, ప్రభుత్వం నుంచి వచ్చే అదేశాల ప్రకారం నష్టపోయిన రైతులను ఆదుకుంటామని తెలిపారు.