
- కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వడ్లు
- పలు చోట్ల పిడుగులు పడి ఇద్దరు వ్యక్తులు, గొర్రెలు, మేకలు మృతి
వెలుగు నెట్‌వర్క్ : కాలం కాని కాలంలో పడిన వర్షం అన్నదాతను ఆగం చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు వర్షం పడింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో కాంటాలకు సిద్ధంగా ఉన్న వడ్లు, కాంటా పూర్తై మిల్లులకు తరలించకుండా ఉండిపోయిన బస్తాలు పూర్తిగా తడిసిపోయాయి. రాశుల కింద నీరు చేరడం, వరదలో వడ్లు కొట్టుకుపోవడంతో వాటిని కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
మహబూబాబాద్ జిల్లాలో బుధవారం కురిసిన వర్షం కారణంగా కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు తడిసిపోయాయి. తొర్రూరు మండలం అమ్మాపురం, కొత్తగూడ మండలం మైలారం గ్రామాల్లోని సెంటర్లలో వడ్లు వరదలో కొట్టుకుపోయాయి. కొత్తగూడ, గూడూరు, కురవి, తొర్రూరు, నెల్లికుదురు, మహబూబాబాద్ మండల్లాల్లో వడ్ల రాశులు తడిసిపోయాయి. పిడుగులు పడడంతో మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఓటాయి గ్రామానికి చెందిన ఏశబోయిన చేరాలు యాదవ్, గూడురు మండలం గుండెంగ గ్రామానికి చెందిన మైదం ప్రభు చనిపోయారు. వరంగల్ జిల్లా పర్వతగిరిలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడడంతో కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొంతమేర తడిసిపోయాయి.
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం, సాయంత్రం వర్షం పడింది. జిల్లాలో కురిసిన భారీ వర్షానికి కొనుగోలు సెంటర్లలో వడ్ల కుప్పలు తడిసి ముద్దయ్యాయి. బీబీపేట మండల కేంద్రంతో పాటు, యాడారం, కామారెడ్డి మార్కెట్‌యార్డు, సదాశివనగర్ మండలంలోని పలు గ్రామాల్లో వడ్లు, మక్కలు తడిసిపోయాయి. కామారెడ్డి, తాడ్వాయి, బీబీపేట, పాల్వంచ, లింగంపేట, సదాశివనగర్, ఎల్లారెడ్డి, నిజాంసాగర్ మండలాల్లో వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోయింది.
మంచిర్యాల జిల్లా దండేపల్లిలో పడిన వర్షంతో వడ్లు తడిసిపోయాయి. వరద కారణంగా కొనుగోలు కేంద్రంలోకి వచ్చిన నీరు రాశుల్లోకి చేరింది. తూకం వేసిన బస్తాలను రైస్‌మిల్లులకు తరలించకపోవడంతో అవి కూడా కొనుగోలు కేంద్రాల్లోనే ఉన్నాయి. దీంతో బస్తాలు తడిసిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం
చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో మంగళవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. బుధవారం రోజంతా చిరుజల్లులు పడడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లి గ్రామంలోని లక్ష్మీనారాయణస్వామి ఆలయంలోకి బురద నీరు చేరడంతో భక్తులు ఇబ్బందిపడ్డారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో బుధవారం ఉదయం ఆరున్నర నుంచి ఎనిమిది గంటల వరకు వర్షం దంచి కొట్టింది. దీంతో పట్టణంలోని నాలాలు పొంగి పొర్లగా.. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. క్లాక్‌టవర్ వద్ద రోడ్డు జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలిగాయి. చారకొండ మండలంలోని కమ్మల్‌పూర్ తండాలో బుధవారం తెల్లవారుజామున పిడుగు పడి మంగ్యా నాయక్ అనే రైతుకు చెందిన రెండు ఆవులు చనిపోయాయి.
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా బుధవారం వర్షం పడింది. సుమారు గంటపైగా వాన పడడంతో తిరుమలసాగర్ మండలం రంగుండ్ల పెద్దవాగులో నీటి ఉధృతి పెరిగింది. తిరుమలగిరి బర్ల బంధం వంతెన పైనుంచి నీరు ప్రవహిస్తోంది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెంలో పిడుగు పడడంతో లక్ష్మయ్య అనే వ్యక్తికి చెందిన 39 గొర్రెలు, మేకలు చనిపోయాయి.
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో బుధవారం తెల్లవారుజామున ఈదురుగాలులతో కురిసిన వర్షం పడింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లోని వడ్ల సంచులు, రాశులు తడిచిపోయాయి. వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో వెయ్యికి పైగా ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. వరద ధాటికి వడ్లు నీటిలో కొట్టుకుపోయాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు వడ్లను ఆరబెట్టగా.. సాయంత్రం మరోసారి వాన పడడంతో వడ్లు పూర్తిగా తడిశాయి. తేమ పేరుతో తూకం ఆలస్యం చేయడం వల్లే తాము నష్టపోవాల్సి వస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.