యూరప్ దేశాల కంటే యూపీనే బెటర్: ప్రధాని మోడీ

యూరప్ దేశాల కంటే యూపీనే బెటర్: ప్రధాని మోడీ
  • ఇంగ్లండ్‌‌‌‌, ఫ్రాన్స్‌‌‌‌, ఇటలీ, స్పెయిన్‌‌‌‌లో 24 కోట్ల జనాభా
  •  యూపీలో కూడా ఇంతే మంది ఉన్నరు
  •  కానీ నాలుగు దేశాల్లో 1.30 లక్షల మంది చనిపోయారు
  •  యూపీలో డెత్స్ 600 మాత్రమే

కరోనా కట్టడి విషయంలో ఉత్తరప్రదేశ్‌‌‌‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్ర మోడీ పొగిడారు. ప్రస్తుత పరిస్థితిని యూపీ ప్రభుత్వం విజయవంతంగా హ్యాండిల్ చేస్తోందని, క్రైసిస్​ను ఒక అవకాశంగా మలుచుకుంటోందని చెప్పారు. కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని వేల మంది ప్రాణాలు కాపాడిందని చెప్పారు. ఈ విషయంలో నాలుగు యూరప్ దేశాల కన్నా యూపీ ఎంతో బెటర్ అన్నారు. లాక్​డౌన్ సమయంలో పని కోల్పోయిన వాళ్లు, మైగ్రెంట్ వర్కర్ల కోసం శుక్రవారం ఉత్తరప్రదేశ్​లో ప్రధాని నరేంద్ర మోడీ 125 రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘ఆత్మనిర్భర్‌‌‌‌ ఉత్తర్‌‌‌‌ప్రదేశ్‌‌‌‌ రోజ్‌‌‌‌గార్‌‌‌‌ అభియాన్‌‌‌‌’ను లాంచ్ చేశారు. కామన్ సర్వీసెస్ సెంటర్లు, కృషి విజ్ఞాన్ కేంద్రాల ద్వారా యూపీలోని ఆరు జిల్లాల ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌లో మాట్లాడారు.

అమెరికాలో అన్ని సౌకర్యాలున్నా..

ఉత్తరప్రదేశ్ సాధించిన ఘనత చాలా పెద్దదని మోడీ అన్నారు. ‘‘ఇంగ్లండ్‌‌‌‌, ఫ్రాన్స్‌‌‌‌, ఇటలీ, స్పెయిన్‌‌‌‌.. ఒకప్పుడు ప్రపంచ దేశాలను గెలిచి, అతిపెద్ద శక్తులుగా అవతరించినవి. ఈ నాలుగు దేశాల జనాభా మొత్తం కలిపి 24 కోట్లు. కానీ మన ఇండియాలో ఒక్క యూపీలోనే 24 కోట్ల మంది ఉన్నారు. కరోనా వల్ల ఇంగ్లండ్‌‌‌‌, ఫ్రాన్స్‌‌‌‌, ఇటలీ, స్పెయిన్‌‌‌‌లో దాదాపు 1.30 లక్షల మంది చనిపోయారు. అవి అభివృద్ధి చెందిన దేశాలు. సౌకర్యాలకు కొరత లేదు. కానీ ఆ నాలుగు దేశాల్లోనూ యూపీలో కంటే ఎన్నో రెట్లు ఎక్కువ డెత్స్ నమోదయ్యాయి. యూపీలో కేవలం 600 మంది మాత్రమే మరణించారు. కరోనాపై పోరాటంలో యూపీ ఎంత సమర్థంగా, చురుకుగా పని చేస్తోందో చెప్పేందుకు ఇది నిదర్శనం” అని కొనియాడారు. అమెరికాలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని.. కానీ ఇప్పటికే 1.25 లక్షల మందికిపైగా అక్కడ చనిపోయారని వివరించారు. ‘‘ఎవరైనా చనిపోవడం దురదృష్టకరం. మన దగ్గరైనా, ప్రపంచంలోని ఇతర దేశాల్లోనైనా అందరి ప్రాణాలు సమానమే. ప్రతి జీవితం ముఖ్యమైనదే” అని అన్నారు.

85 వేల ప్రాణాలు కాపాడారు

‘‘పరిస్థితి ఎంత సీరియస్​నో యోగిజీ అర్థం చేసుకున్నారు. ఫిర్యాదులు చేయలేదు.. వర్రీ కాలేదు. యోగి, ఆయన టీం కలిసి 24 కోట్ల మందిని కాపాడుకునేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకున్నారు. వీలైనంత వరకు వైరస్  స్ప్రెడ్ కాకుండా అడ్డుకున్నారు. యోగి తండ్రి ఈ మధ్యే చనిపోయారు. కానీ ఆయన అంత్యక్రియలకు వెళ్లలేదు. యోగి తన పనిలోనే ఉండిపోయారు. ఆస్పత్రులు, బెడ్లు, టెస్టులు, ఇతర సౌకర్యాలపై ప్రజలకు భరోసా కల్పిస్తూనే ఉన్నారు” అని మోడీ చెప్పారు. ‘‘ఒకవేళ యోగి, ఆయన టీమ్.. సరైన ఏర్పాట్లు చేయకుంటే, జాగ్రత్తలు తీసుకోకుంటే.. 85 వేల మంది చనిపోయేవారు. యూపీ ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్లే ఇన్ని ప్రాణాలు నిలబడ్డాయి” అని పొగిడారు.

1.25 కోట్ల మందికి పని..

ఆత్మనిర్భర్‌‌‌‌ ఉత్తర్‌‌‌‌ప్రదేశ్‌‌‌‌ రోజ్‌‌‌‌గార్‌‌‌‌ అభియాన్‌‌‌‌ ద్వారా ఇప్పుడు స్థానికంగా 31 జిల్లాల్లో దాదాపు 1. 25 కోట్ల మందికి లబ్ధి చేకూరనుంది. ఇతర రాష్ర్టాల నుంచి తిరిగి వచ్చిన వలస కూలీలు.. ఇకపై రాష్ట్రంలోనే ఉండి పనులు చేసుకునేందుకు ఈ పథకం అవకాశం లభించిందని మోడీ చెప్పారు. వందలాది శ్రామిక్ రైళ్లు నడిపి 30 లక్షల నుంచి 35 లక్షల మందిని యూపీకి రప్పించామన్నారు. యూపీలో పేదలు, మైగ్రెంట్ వర్కర్లకు ఫ్రీ రేషన్ ఇచ్చామని తెలిపారు. జన్ ధన్ అకౌంట్లు ఉన్న 75 లక్షల మంది పేద మహిళలకు రూ.5 వేల కోట్లు అందజేశామన్నారు. ఇండియాను ‘సెల్ఫ్ రిలయన్స్’ వైపు నడిపించడంలో యూపీ ముందుందని అన్నారు. సుమారు 60 లక్షల మందికి ఎంఎస్ఎంఈల్లో ఉపాధి కల్పించిందన్నారు.

వ్యాక్సిన్ వచ్చే దాకా.. జాగ్రత్తలే మెడిసిన్లు

కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంత వరకు ప్రజలందరూ అత్యంత అప్రమత్తతతో ఉండాలని మోడీ కోరారు. ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకోవాలని, ఫిజికల్ డిస్టెన్స్ తప్పక పాటించాలని విజ్ఞప్తి చేశారు. ‘‘రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి. చేతులను తరచూ సబ్బుతో కడుక్కోవాలి. ఇండ్ల నుంచి బయటికి వెళ్లేటప్పుడు మాస్క్​లు పెట్టుకోవాలి. మనిషికి మనిషికి మధ్య ఆరడుగుల దూరం పాటించడం మరీ ముఖ్యం. వ్యాక్సిన్ వచ్చే దాకా ఇవే మెడిసిన్లు’’ అని మోడీ అన్నారు. ఇలా చెబుతూ తన టవ్వాల్​ను మాస్క్​లా పెట్టుకుని చూపించారు.