అధికారంలోకి రాగానే భాగ్యనగరంగా మారుస్తాం: యోగి ఆదిత్యనాథ్

అధికారంలోకి రాగానే భాగ్యనగరంగా మారుస్తాం: యోగి ఆదిత్యనాథ్

బషీర్ బాగ్, వెలుగు: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామని యూపీ  ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ కు మద్దతుగా శనివారం మంగళ్ హట్ లో ఆకాశపురి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి.. అక్కడి నుంచి పురానాపూల్ గాంధీ విగ్రహం వరకు రోడ్ షో తీశారు. జుమ్మెరాత్ బజార్ చౌరస్తా వద్ద బీజేపీ నేతలు యోగి, రాజాసింగ్ రోడ్ షోకు రోడ్డుకు ఇరువైపులా ఆరు బుల్డోజర్లను ఏర్పాటు చేసి వారిపై పూల వర్షం కురిపించారు.

బేగంబజార్ చౌరస్తాలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో దేశంలో అవినీతి, కుంభకోణాలు వెలుగు చూశాయన్నారు. మోదీ అధికారంలోకి రాగానే అవన్నీ రూపుమాపారన్నారు. తెలంగాణ కూడా డబుల్ ఇంజిన్​ సర్కార్  వస్తేనే రాష్ట్రం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. పదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం పాలించి సర్వనాశనం చేసిందన్నారు.

రాష్ట్ర ప్రజలంతా కమలం గుర్తుకు ఓటు వేసి బీజేపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. గోషామహల్ లో హిందు ధర్మం కోసం పోరాడే రాజాసింగ్ ను గెలిపించి ప్రజలందరూ అయోధ్యలో నిర్మించిన భవ్య రామ మందిరంను దర్శించుకోవాలని సూచించారు.  బేగంబజార్ చత్రి వద్ద యోగిని చూసేందుకు వేలాది మంది బీజేపీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు తరలిరావడంతో పరిసరాలు జనసంద్రంగా మారాయి.