కేసీఆర్ కుటుంబంలో ఆస్తుల పంచాది.. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లు పదేండ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకున్నరు: వివేక్ వెంకటస్వామి

కేసీఆర్ కుటుంబంలో ఆస్తుల పంచాది.. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ లీడర్లు పదేండ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకున్నరు: వివేక్ వెంకటస్వామి
  • సింగరేణికి కొత్త బొగ్గు గనులు రాకుండా అడ్డుకున్నరు 
  • చెన్నూరు డీఎంఎఫ్‌‌‌‌టీ నిధులను ఇతర ప్రాంతాలకు తరలించారని ఫైర్ 
  • త్వరలోనే కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని వెల్లడి 
  • చెన్నూరులో కాంగ్రెస్​ అభ్యర్థుల తరఫున మంత్రి ప్రచారం 

కోల్‌‌‌‌బెల్ట్‌‌‌‌/కోటపల్లి, వెలుగు: కేసీఆర్‌‌‌‌ కుటుంబంలో ఆస్తుల పంచాయితీ నడుస్తోందని మంత్రి వివేక్‌‌‌‌ వెంకటస్వామి అన్నారు. కుటుంబ ఆస్తులపై ఆయన బిడ్డ కవిత చేస్తున్న ఆరోపణలపై కుటుంబ సభ్యులెవరూ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. శనివారం మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో కాంగ్రెస్‌‌‌‌ అభ్యర్థుల తరఫున ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో ఏర్పాటు చేసిన కార్నర్‌‌‌‌ మీటింగ్స్‌‌‌‌లో మాట్లాడారు. చెన్నూరు, క్యాతనపల్లి మున్సిపాలిటీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌‌‌‌ క్యాండిడేట్లను గెలిపించాలని వివేక్ కోరారు. 

‘‘పదేండ్ల కేసీఆర్‌‌‌‌ పాలనలో ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు దండుకుని ఫ్యామిలీ, పార్టీ ఆస్తులు పెంచుకున్నారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీ, కల్వకుంట్ల ఫ్యామిలీ రాష్ట్రాన్ని దోచుకున్నాయి. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను రూ.8 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారు. దేశంలో ఏ పార్టీకి లేని విధంగా బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు రూ.వెయ్యి కోట్ల ఎలక్టోరల్‌‌‌‌ బాండ్లు ఉన్నాయి. పేదలకు డబుల్ బెడ్రూమ్‌‌‌‌ ఇండ్లు ఇవ్వకుండా.. కేసీఆర్, ఆయన కొడుకు, కూతురు, అల్లుడు మాత్రం వందల ఎకరాల్లో ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌లు కట్టుకున్నారు” అని మండిపడ్డారు. ‘‘రాష్ట్ర ఆదాయం రూ.లక్ష కోట్లు మాత్రమే ఉండడంతో ఆ డబ్బులు అప్పుల వడ్డీకి కూడా సరిపోవడం లేదు. 

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ఇచ్చిన హామీ ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నం. మా రెండేండ్ల పాలనపై ప్రజల్లో సానుకూల వాతావరణం ఉంది. త్వరలో కొత్త పెన్షన్లు సైతం మంజూరు చేస్తాం” అని వెల్లడించారు. కాగా, అంతకుముందు కాంగ్రెస్‌‌‌‌లో చేరిన పలువురికి మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌‌‌‌కుమార్‌‌‌‌తో కలిసి వివేక్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

సింగరేణికి కొత్త బొగ్గు గనులు రాకుండా అడ్డుకున్నరు

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ హయాంలో సింగరేణిలో ఒక్క కొత్త గని కూడా తవ్వలేదని వివేక్‌‌‌‌ చెప్పారు. ‘‘బొగ్గు బ్లాక్‌‌‌‌ల కేటాయింపు కోసం కేంద్రం అమలు చేస్తున్న వేలంలో సింగరేణిని పాల్గొనకుండా బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అడ్డుకుంది. సింగరేణిని అప్పుల ఊబిలోకి నెట్టింది. మేం అధికారంలోకి వచ్చాక కొత్త బ్లాక్‌‌‌‌లను దక్కించుకునేందుకు సింగరేణి వేలంలో పాల్గొనేలా సీఎం రేవంత్‌‌‌‌రెడ్డిని ఒప్పించాను. రామకృష్ణాపూర్‌‌‌‌ ఓసీపీ విస్తరణలో భాగంగా రెండో ఫేజ్​ కొత్త గని రానుంది. జైపూర్‌‌‌‌ సింగరేణి థర్మల్‌‌‌‌ పవర్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌లో 800 మెగావాట్ల మూడో యూనిట్​ నిర్మాణ పనులు చేపట్టనున్నం. వీటి ద్వారా స్థానికులకు వేలాది ఉద్యోగాలు వస్తాయి” అని తెలిపారు. 

చెన్నూరు ప్రాంత డీఎంఎఫ్‌‌‌‌టీ, సీఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ నిధులను హరీశ్‌‌‌‌రావు, కేటీఆర్‌‌‌‌ కలిసి సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌‌‌‌కు తరలించారని మండిపడ్డారు. ఈ నిధులతోనే హరీశ్‌‌‌‌రావు సిద్దిపేటలో స్టేడియం నిర్మించారని, కేటీఆర్‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌లు కట్టుకున్నారని ఫైర్ అయ్యారు. డీఎంఎఫ్‌‌‌‌టీ నిధులు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నా కేసీఆర్‌‌‌‌ చిన్నకొడుకుగా వ్యవహరించే బాల్క సుమన్‌‌‌‌ పట్టించుకోలేదని మండిపడ్డారు. ఎంపీ, ఎమ్మెల్యేగా పనిచేసిన బాల్క సుమన్‌‌‌‌.. చెన్నూరు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని, పైగా ఇసుక దందా, భూ మాఫియాను ప్రోత్సహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిధులు లేకున్నా ప్రొసీడింగ్స్‌‌‌‌ను చూపి ప్రజలను మోసం చేశారన్నారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇసుక, భూదందాను అడ్డుకున్నట్టు చెప్పారు. గనులశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇసుక రాయల్టీ పన్నుల ద్వారా ప్రభుత్వానికి 22 శాతం ఆదాయం పెంచినట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌ కోసం కోటపల్లి మండలంలోని బబ్బెరచెలక, దేవులవాడ, లక్ష్మీపూర్‌‌‌‌ రైతుల నుంచి 250 ఎకరాల భూములు తీసుకున్నట్లు చెప్పారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పాలకులు నాలుగేండ్లు రైతులకు పరిహారం ఇవ్వలేదన్నారు. తాను సీఎంను ఒప్పించి రూ.28 కోట్ల నష్టపరిహారం మంజూరు చేయించానని, దాన్ని త్వరలో రైతులకు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. 

చెన్నూరులో 500 కోట్లతో అభివృద్ధి పనులు

చెన్నూరులో రూ.500 కోట్లతో పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వివేక్‌‌‌‌ తెలిపారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ హయాంలో మున్సిపల్‌‌‌‌ వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీలు లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. తాను ఎమ్మెల్యే అయిన తర్వాత సీసీ రోడ్లు, డ్రైనేజీలను నిర్మించినట్లు చెప్పారు. నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశానని, చెన్నూరు టౌన్‌‌‌‌కు మరో 300 ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రూ.100 కోట్ల అమృత్‌‌‌‌ స్కీం నిధులతో చెన్నూరు, క్యాతనపల్లి, మందమర్రిలో తాగునీటి సరఫరా పనులు చేపట్టామన్నారు. 

మరో ఆరు నెలల్లో నల్లాల ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన వాటర్‌‌‌‌ను సప్లై చేస్తామన్నారు. చెన్నూరు పట్టణంలో వచ్చే 15 ఏండ్లలో నీటి ఎద్దడి రాకుండా కొత్తగా రూ.50 కోట్లతో గోదావరి తాగునీటి పథకానికి ప్రతిపాదనలు చేశామన్నారు. చెన్నూరులో రూ.50 కోట్లతో ఏటీసీ సెంటర్‌‌‌‌ నిర్మిస్తున్నామని, దీని ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. రూ.250 కోట్లతో సోమనపల్లిలో యంగ్‌‌‌‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌‌‌‌ స్కూల్‌‌‌‌ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రతి కుల సంఘానికి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు ఇస్తున్నామని పేర్కొన్నారు.