
- అమ్మాయిలను హెచ్చరిస్తూ యూపీ గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు
వారణాసి: ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లివిన్ రిలేషన్‌షిప్ (సహజీవనం)కు దూరంగా ఉండాలని మహిళలకు సూచించిన ఆమె.. లేదంటే లివన్ పార్టనర్ చేతిలో 50 ముక్కలు అవుతారంటూ హెచ్చరించారు. బుధవారం వారణాసిలోని మహాత్మాగాంధీ కాశీ విద్యాపీఠం 47వ కాన్వొకేషన్ కార్యక్రమంలో ఆనందీబెన్ పటేల్ మాట్లాడారు. సహజీవనంపై వుమెన్ స్టూడెంట్లను హెచ్చరించారు.
‘‘అమ్మాయిలారా.. మీ పర్సనల్ లైఫ్ విషయంలో తెలివిగా నిర్ణయాలు తీసుకోండి. లివిన్ రిలేషన్ షిప్స్‌కు దూరంగా ఉండండి. లివిన్ రిలేషన్‌షిప్స్ ఇప్పుడు ట్రెండ్ కావచ్చు. కానీ వాటి జోలికి వెళ్లొద్దు. సమాజంలో ఏమీ జరుగుతున్నదో మీరు చూస్తున్నారు కదా.. మహిళలు 50 ముక్కలు అవుతున్నారు. గత 10 రోజులుగా ఇలాంటి వార్తలనే నేను వింటున్నాను. వాటిని చూసినప్పుడల్లా చాలా బాధగా ఉంటున్నది. ఎందుకు మన అమ్మాయిలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు?” అని ఆవేదన వ్యక్తం చేశారు.