పల్లె పట్నమాయె.. ‘ఉపాధి’ పాయె

పల్లె పట్నమాయె.. ‘ఉపాధి’ పాయె

రాష్ట్రంలో లక్షా 93 వేల కుటుంబాలు ఉపాధిని కోల్పోయాయి. ఉన్న ఊరిలో పని దొరక్క రోడ్డునపడ్డాయి. గత్యంతరం లేక తమకు అలవాటు లేని కొత్త పనులు వెతుక్కుంటున్నాయి. పట్నం బాట పట్టి లేబర్‍ అడ్డాలపై బతుకులీడిస్తున్నాయి. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో సమీపంలోని గ్రామాలను విలీనం చేయటంతో ఈ దుస్థితి ఏర్పడింది. వీళ్లందరికీ మొన్నటిదాకా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కొండంత అండగా ఉండేది. ఉన్న ఊళ్లోనే పనిని చూపించేంది. విలీనం కారణంగా పల్లె పట్నంగా మారడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో 3 లక్షల6 వేలమంది కూలీలకు జీవనోపాధి కరువైంది. అర్బన్ ఏరియాలో ఉపాధి హామీ చట్టం వర్తించకపోవటంతో వీరంతా ఉపాధిని కోల్పోవాల్సి వచ్చింది. ఉపాధి హామీ పథకంలోని 1,93,300 జాబ్​కార్డులను ప్రభుత్వం తొలిగించింది. గత ఏడాది ఎన్నికలకు ముందే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 70 మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది. 41 పాత మున్సిపాలిటీల్లో చుట్టుపక్కల గ్రామాలను కలిపేసింది. ఇలా దాదాపు 384 గ్రామ పంచాయతీలను పట్టణాల్లో కలిపేసింది. పల్లెలు పట్టణాల స్వరూపాన్ని సంతరించుకోవటంతో పరిపాలనా పరిధి విస్తరించిందని నేతలు సంబురపడ్డారు. కానీ విలీనం ఎఫెక్ట్ నేరుగా కూలీల బతుకులను దెబ్బతీసింది. ఇప్పుడు ఒక్కో మున్సిపాలిటీలో కనీసం మూడు వేల నుంచి నాలుగు వేల మంది కూలీలకు జీవనోపాధి సమస్యగా మారింది.

వద్దని కాళ్లావేళ్లా పడ్డా..

తమకు ఉపాధి హామీ జాబ్‍ కార్డులున్నాయని.. తమను మున్సిపాలిటీల్లో కలపొద్దని ఇప్పటికే పలు జిల్లాల్లో ఊళ్లకు ఊళ్లే నిరసనలు తెలిపాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రాన్ని మున్సిపాలిటీగా అప్‍ గ్రేడ్‍ చేసేందుకు సమీపంలోని బంధంపల్లి, రంగంపల్లి, చందపల్లి గ్రామాలను విలీనం చేశారు. ఈ ఒక్క ఊళ్లోనే 330 జాబ్ కార్డులు, 796 మంది కూలీలు ఉన్నారు. విలీనం వల్ల ఇప్పుడు వీళ్లందరూ ఉపాధి హామీ పనులకు దూరమయ్యారు. వీరిలో ఎక్కువ మంది వ్యవసాయ కూలీలే. పొలం పనులు లేనప్పుడు వంద రోజుల పని మీదనే ఆధారపడ్డామని, తమ గ్రామాన్ని మున్సిపాలిటీలో కలపొద్దని అధికారుల కాళ్లవేళ్లా పడ్డామని కూలీలు చెప్తున్నారు. ఇందుకోసం వారు ఎంపీ ఎలక్షన్లను బహిష్కరించి నిరసన తెలిపారు. మెదక్‍ జిల్లా అవుసులపల్లి గ్రామంలోని కూలీలు తమకు ఉపాధి పనులు కల్పించాలంటూ ఎన్నికలకు ముందు మెదక్  కలెక్టరేట్‌‌‌‌ ఎదుట తట్టాపారలతో ధర్నా చేశారు. జాబ్‍ కార్డులుంటే ఎలాగైనా పని దొరికేదని, పని ఇవ్వని పరిస్థితి ఉంటే కనీస వేతనం దొరికేదని కూలీలు చెప్తున్నారు. ఉపాధి హమీ పథకంలో పని కావాలని దరఖాస్తు చేస్తే జాబ్‍ కార్డులున్న వారందరికీ 15 రోజుల్లో పని కల్పించే నిబంధన ఉంది. పని కల్పించకపోతే కనీస వేతనం చెల్లిస్తారు. విలీన గ్రామాలు పట్టణం కిందకు వెళ్లడంతో ఉపాధి పథకం ఆగిపోయి, కూలీలకు పనులు కరువయ్యాయి.

‘ఉపాధి’ కోల్పోయిన ఫీల్డ్ అసిస్టెంట్లు

వంద రోజుల పనిదినాలపైన ఆధారపడి జీవించిన పేద, నిరుపేద కుటుంబాలకు నరేగా పథకం కొండంత అండగా నిలిచింది. వ్యవసాయ పనులు జరగని ఎండాకాలంలో ఉపాధి హామీ పనులకు డిమాండ్ ఉండేది. కూలీలకు ఎంతలేదన్న రోజు ఖర్చులకు సరిపడే ఆదాయం దొరికేది. కనీస సం రెండొందల రూపాయలు చేతికొచ్చేవి. కానీ ఇప్పుడు ఆయా గ్రామాల్లోని జాబ్‍ కార్డుదారులందరి నోటి కాడి బుక్క ఎత్తుకుపోయినట్లయింది. తమ గ్రామాలను పట్టణంలో కలపడంతో తమ ఉద్యోగాలు కూడా పోయాయని ప్రతి గ్రామంలో ఉపాధి హామీ కూలీల అటెండెన్స్, మస్టర్‍లు నమోదు చేసే ఫీల్డ్ అసిస్టెంట్లు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిలిచిన పనులు

కొత్తగా మున్సిపాలిటీలు ఏర్పడటంతో అప్పటికే విలీనమైన పంచాయతీల్లో జరుగుతున్న పనులకు యథావిధిగా కొనసాగించారు. ఆమోదం పొందిన పాత పనులు పూర్తయ్యే వరకు ఉపాధి హామీ పథకం కొనసాగించారు. 2018–-19 సంవత్సరానికి సంబంధించి విలీన పంచాయతీల్లో మిగిలిన పనులు గత ఆర్థిక సంవత్సరం చివరి వరకు నడిపించారు. కానీ ఈ ఏడాది ఏప్రిల్‍ నుంచి విలీన పంచాయతీల వివరాలను గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధి హామీ వెబ్‍సైట్‍ నుంచి తొలిగించింది. ఉపాధి హామీ పనులను నిలిపేసింది. దీంతో కూలీలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కొత్తగా మున్సిపాలిటీలుగా మారిన దాదాపు అన్ని ఆవాసాలు, పంచాయతీలన్నీ గ్రామీణ వాతావరణంతో మమేకమైనవే. వీటిని పట్టణాల్లో విలీనం చేసి ఏడాది కావొస్తున్న పట్టణ ఉపాధికి సంబంధించి ప్రణాళికలు రూపొందించకపోవడంతో కూలీలు ఇబ్బందుల్లో పడ్డారు.

అప్పుడు ఊళ్లోనే పని.. ఇప్పుడు?

ఈ ఫొటోలో కనిపిస్తున్న వాళ్లు గడ్డం అనసూయ, వెంకటయ్య దంపతులు, వారి కొడుకు ప్రవీణ్‌‌‌‌. వీరిది మెదక్​ జిల్లా తూప్రాన్‌‌‌‌. పేద కుటుంబానికి చెందిన వీళ్లు జాబ్‌‌‌‌ కార్డులు తీసుకుని,  ఆరేళ్లుగా ఉపాధి పనులకు వెళుతున్నారు.  అందరికీ కలిపి  నెలకు ఐదారు వేల రూపాయలు రావడంతో… ఇబ్బంది లేకుండా ఇల్లు గడిచిపోయేది. అయితే గ్రామ పంచాయతీగా ఉన్న తూప్రాన్‌‌‌‌ను మున్సిపాలిటీ చేయడంతో అక్కడ ఉపాధి హామీ పథకం నిలిచిపోయింది. ఈ కుటుంబానికి ‘ఉపాధి’ దూరమైంది. అనసూయ, వెంకటయ్య కూలీ పనులకు వెళ్తున్నా ఇల్లు గడవడం కష్టంగా మారింది. ఇంతకు ముందు ఊళ్లోనే పని దొరికేదని, ఇప్పుడు ఎక్కడ కూలీ పని ఉంటే అక్కడికి వెళ్లాల్సి వస్తోందని వాళ్లు వాపోతున్నారు. రోజూ పని దొరుకుతుందన్న గ్యారంటీ కూడా లేక ఆందోళన చెందుతున్నారు.