
బెంగళూరు: బెంగళూరులో పట్టపగలు ఘోరం జరిగింది. గురువారం మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల సమయంలో యామిని ప్రియ అనే 20 ఏళ్ల యువతి దారుణ హత్యకు గురైంది. ప్రేమ పేరుతో ఆమె వెంటపడి వేధిస్తున్న ప్రేమోన్మాది ఆమెను అత్యంత దారుణంగా పట్టపగలు అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై గొంతు కోసి చంపేశాడు. బైక్పై వచ్చి ఆమెపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో యామిని స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయింది.
యామిని పరీక్షలు రాసి కాలేజ్ నుంచి ఇంటికి తిరిగి వెళుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆమెను హత్య చేసిన నిందితుడిని విఘ్నేష్గా గుర్తించిన పోలీసులు అతని ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఆమె కళ్లలో సాల్ట్ పౌడర్ చల్లి నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ హత్య ఘటన బెంగళూరులోని శ్రీరాంపూర్ రైల్వే ట్రాక్ సమీపంలో జరిగింది.
హత్యకు గురైన విద్యార్థిని యామిని ప్రియ వయసు 20 సంవత్సరాలు. బనశంకరిలోని ఒక కళాశాలలో బి ఫార్మసీ చదువుతున్న ఆమె ఈ ఉదయం కళాశాలకు వెళ్లడానికి స్వాతంత్య్రపాల్యలోని తన ఇంటి నుంచి బయలుదేరింది. మధ్యాహ్నం కళాశాల నుంచి పరీక్షలు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా.. మల్లేశ్వరంలోని మంత్రి మాల్ సమీపంలో రైల్వే ట్రాక్ వైపు ఆమె నడుచుకుంటూ వెళుతుండగా.. వెనుక నుంచి వచ్చిన విఘ్నేష్ ఆమెను గొంతు కోసి హత్య చేసి పారిపోయాడు.
యామినిని విఘ్నేష్ ప్రేమ పేరుతో వేధించాడు. యామిని విఘ్నేష్ ప్రేమను తిరస్కరించింది. ఒకానొక సందర్భంలో ఆమె మెడలో తాళి కట్టేందుకు కూడా విఘ్నేష్ యత్నించి.. ఆమె మెడలో తాళి కూడా కట్టాడని తెలిసింది. ఈ పరిణామాలతో విఘ్నేష్ ను యామిని ఛీ కొట్టింది. అయినా విఘ్నేష్ వెంటపడటం మానుకోలేదు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని యామిని హెచ్చరించడంతో ఈరోజు యామిని ఇంటికి వెళుతుండగా విఘ్నేష్ ఆమెను అనుసరించాడు. రైల్వే ట్రాక్ దగ్గరకు రాగానే ఆమె కళ్ళలో ఉప్పు పొడి పోసి ఇష్టానుసారంగా దాడి చేశాడు.
మెడ, ముఖంపై పదునైన ఆయుధంతో దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావం కావడంతో యామిని అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న శ్రీరాంపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్వాతంత్య్రపాళ్యంలో నివసించే విఘ్నేష్ అనే వ్యక్తి కొన్ని సంవత్సరాలుగా యామిని ప్రియను వెంబడిస్తూ తనతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేస్తున్నాడని పోలీసుల విచారణలో తెలిసింది. ఒకసారి, అతను ఆమెకు బలవంతంగా తాళి కట్టాడు. ఇష్టం లేని యామిని తన ప్రేమికుడి తాళిని తెంచి దూరంగా ఉంచింది. గతంలో మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో విఘ్నేష్‌పై దొంగతనం కేసు కూడా నమోదైంది.