
వరంగల్: మామునూరు ఎయిర్‌పోర్టు భూసేకరణ కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 90 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎయిర్‍పోర్ట్ కోసం దాదాపు వెయ్యి ఎకరాల భూమి అవసరమవుతుంది. ఇప్పటికే ఎయిర్‌పోర్టు పరిధిలో 696 ఎకరాల స్థలం ఉన్నది. ఆ భూమికి అదనంగా మరో 253 ఎకరాల్లో కొంత రన్‌వే విస్తరణ, టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ), నావిగేషన్ ఇన్‌స్ట్రుమెంట్ ఇన్‌స్టాలేషన్ నిర్మాణాలు చేపట్టనున్నారు.
మొత్తంగా 309 మంది రైతులు, మరో 50 మంది ప్లాట్ల యజమానుల వద్ద మొత్తంగా 253 ఎకరాల భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 2024 నవంబర్ 17న మొదట రూ.205 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది. అధికారులు గ్రామాలవారీగా భూసేకరణ ప్రక్రియ చేపడుతున్నారు.
రైతులకు ఒక్కో ఎకరానికి రూ.కోటి 20 లక్షల చొప్పున చెల్లించేలా ప్రభుత్వం ముందుకొచ్చింది. ఎయిర్పోర్ట్ఏర్పాటులో ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం జరగకూడదనే ఉద్దేశంతో ఇచ్చిన మాట ప్రకారం.. రాష్ట్ర సర్కారు రూ.205 కోట్ల నిధులను 2025 జులైలో విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా.. 90 కోట్ల రూపాయలు భూ సేకరణ కోసం ప్రభుత్వం విడుదల చేయడంతో మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణంలో మరో ముందడుగు పడినట్లయింది.
ఎయిర్‍పోర్ట్ విస్తరణకు జీఎంఆర్సంస్థతో 150 కిలోమీటర్ల అగ్రిమెంట్ సమస్య ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవతో అది పరిష్కారమైంది. ఫిబ్రవరి 28న కేంద్ర ప్రభుత్వం వరంగల్ కేంద్రంగా మామునూర్ ఎయిర్‍పోర్ట్ విస్తరణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.