
హైదరాబాద్: హైదరాబాద్‌లో నకిలీ తేనె తయారీ, విక్రయంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. కాంచన్ బాగ్ పోలీస్ పరిధిలో బాబా నగర్ బ్లాక్ వద్ద నకిలీ తేనె ఫ్యాక్టరీలో పోలీసులు తనిఖీలు చేశారు. ముగ్గురు నిందితులు పట్టుబడ్డారు. బెల్లం కలిపి నకిలీ తేనె తయారు చేసి అమాయకులను ఈ తేనె ఫ్యాక్టరీ మోసం చేస్తుందని పోలీసుల తనిఖీల్లో వెల్లడైంది.
దాడిలో 100 కిలోల నకిలీ తేనె, 2 కార్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రతి ఇంటి వంట గదిలో తప్పకుండా ఉండే బియ్యం, ఉప్పూ, పప్పూ, పసుపు, కారం, నూనె–నెయ్యీ, పాలు–పెరుగు, తేనె, అల్లం, వెల్లుల్లి, మసాలా దినుసులు, మైదా, గోధుమ, శనగ పిండి వరకు అన్నీ కల్తీ కావడం ఆందోళన కలిగిస్తోంది.
ఆహార కల్తీకి పాల్పడుతూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్తున్నోళ్లపైనా ఆఫీసర్లు కఠిన చర్యలు తీసుకోవడం లేదు. చట్టాలు పటిష్టంగా ఉన్నప్పటికీ కేవలం నోటీసులతో, మహా అయితే నామమాత్రపు పెనాల్టీ వేయడంతోనే సరిపెడ్తున్నారు. గత రెండేండ్లలో 3 వేల మందికి పైగా నోటీసులు ఇచ్చినా, వారిలో ఒక్కరంటే ఒక్కరు కూడా జైలుకెళ్లలేదు. కనీసం ఆయా హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార తయారీ కేంద్రాల లైసెన్సులు కూడా రద్దు చేయడం లేదు. దీంతో ఫుడ్‌సేఫ్టీ అధికారులు ఎన్ని తనిఖీలు చేస్తున్నప్పటికీ కల్తీరాయుళ్లు అదరక బెదరక తమ దందా కొనసాగిస్తున్నారు.