
మహిళల వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా జట్టు తిరుగులేకుండా దూసుకెళ్తుంది. గురువారం (అక్టోబర్ 16) బంగ్లాదేశ్ ను చిత్తుచిత్తుగా ఓడించి సెమీస్ కు అర్హత సాధించింది. మొత్తం 8 జట్లు రౌండ్ రాబిన్ లీగ్ తరహాలో ఆడుతున్న ఈ టోర్నీలో ఆస్ట్రేలియా సెమీస్ కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ ల్లో కంగారూలు నాలుగు మ్యాచ్ ల్లో విజయం సాధించగా.. శ్రీలంకపై జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వడంతో ఫలితం రాలేదు. ప్రస్తుతం 9 పాయింట్లతో టాప్ లో ఉంది. మరో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్ లు ఇతర జట్లకు చాలా కీలకం కానున్నాయి.
బంగ్లాను ఘోరంగా ఓడించారు:
ఈ టోర్నమెంట్ లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఆస్ట్రేలియా గురువారం (అక్టోబర్ 16) బంగ్లాదేశ్ పై జరిగిన మ్యాచ్ లోనూ అదే జోరు చూపించింది. మొదట బౌలింగ్ లో సమిష్టిగా రాణించగా.. ఛేజింగ్ లో ఓపెనర్లు చెలరేగి ఆడి భారీ విజయాన్ని అందించారు. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఛేజింగ్ ఆస్ట్రేలియా వికెట్లేమీ కోల్పోకుండా 24.5 ఓవర్లలో 205 పరుగులు చేసి 10 వికెట్ల తేడాతో గెలిచింది. మూనీ (113; 77 బంతుల్లో 20 ఫోర్లు) సెంచరీతో దుమ్ములేపితే.. ఫోబ్ లిచ్‌ఫీల్డ్ 84 పరుగులు చేస్తుంది రాణించింది.
Australia book their #CWC25 semi-final berth with a convincing win 👏
— ICC (@ICC) October 16, 2025
Watch #AUSvBAN highlights 🎦▶️: https://t.co/xB4oRkKy0T pic.twitter.com/zDcfZ6DIbL
టీమిండియాకు టెన్షన్ టెన్షన్:
ఒకవైపు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా వరుస విజయాలతో దూసుకెళ్తుంటే ఇండియా మాత్రం ఓటములతో ఢీలా పడుతుంది. తొలి మ్యాచ్ లో శ్రీలంకపై గెలిచి బోణీ కొట్టిన కౌర్ సేన.. ఆ తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై భారీ విజయం సాధించింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాత రెండు పరాజయాలు టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీశాయి. సౌతాఫ్రికాపై గెలిచే మ్యాచ్ లో ఓడిన మన జట్టు.. ఆ తర్వాత ఆస్ట్రేలియాపై భారీ స్కోర్ చేసి పరాజయం పాలయ్యారు. ఓవరాల్ గా నాలుగు మ్యాచ్ ల్లో రెండు గెలిచి.. మరో రెండు ఓడింది. సెమీస్ కు అర్హత సాధించాలంటే మిగిలిన మూడు మ్యాచ్ ల్లో రెండు గెలవాలి. టీమిండియా మహిళల జట్టు తమ తదుపరి మ్యాచ్ ఆదివారం (అక్టోబర్ 19) ఇంగ్లాండ్ తో ఆడనుంది.