‘మహాభారత్’ కర్ణుడి పాత్రధారి పంకజ్ధీర్ కన్నుమూత

‘మహాభారత్’ కర్ణుడి పాత్రధారి పంకజ్ధీర్ కన్నుమూత

ముంబై: ‘మహాభారత్’ టీవీ సీరియల్‎లో కర్ణుడి పాత్రలో నటించి, మెప్పించిన పంకజ్ ధీర్ కన్నుమూశారు. కొన్నాళ్లుగా క్యాన్సర్‎తో బాధపడుతున్న ఆయన బుధవారం ముంబైలో తుదిశ్వాస విడిచారు. పంకజ్​ధీర్​ వయసు 68 ఏండ్లు. బీఆర్ చోప్రా దర్శకత్వంలో 1988లో వచ్చిన ‘మహాభారత్​’ టీవీ సీరియల్​అప్పట్లో ఓ సంచలనం. అందులో కీలకమైన కర్ణుడి పాత్రలో పంకజ్​ నటించి అందరినీ మెప్పించారు. 1994లో వచ్చిన ‘చంద్రకాంత’ టీవీ సీరియల్​లోనూ కీలకమైన శివదత్​ రాజు క్యారెక్టర్‎లోనూ ఈయన నటించారు. 

పంజాబ్‎లో పుట్టిన పంకజ్​ ధీర్ 1980లో సినీరంగ ప్రవేశం చేశారు. సినిమాల్లో కన్నా.. మహాభారత్​, చంద్రకాంత టీవీ సీరియల్స్​ ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపును తెచ్చిపెట్టాయి. పంకజ్​ తండ్రి సీఎల్​ ధీర్ సినీ నిర్మాత, దర్శకుడు. గీత, బహూ బేటీ, జిందగీ వంటి సినిమాలను సీఎల్​ ధీర్​ తెరకెక్కించారు.

 తన సోదరుడు సట్లజ్​ ధీర్​తో కలిసి ముంబైలో విసాజే స్టూడియోస్​ను పంకజ్​ ధీర్​ ఏర్పాటు చేశారు. 2010లో అభినయ్​ యాక్టింగ్ అకాడమీని స్థాపించారు. పంకజ్​ ధీర్​ భార్య అనితా ధీర్​ కాస్ట్యూమ్​ డిజైనర్​. వీళ్ల కుమారుడు నికితిన్​ ధీర్​ బాలీవుడ్​ నటుడు. కోడలు కృతికా సెంగార్​ కూడా నటి. ‘ఝాన్సీ కి రాణి’ టీవీ సీరియల్‎లో ప్రధాన పాత్రలో కృతిక నటించారు.