
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఓటర్లుగా టాప్ హీరోయిన్లు తమన్న, రకుల్ ప్రీత్ సింగ్, సమంత ఓటర్లుగా ఉన్నారని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఓటర్ ఐడీ కార్డులు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ఎన్నికల అధికారులు విచారణ చేయగా వేరే వ్యక్తుల ఎపిక్ నంబర్ల తో నకిలీ ఐడీ కార్డులను తయారు చేసినట్టు తేలింది.
ఫేక్ ఓటర్ ఐడీల ప్రచారంపై హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు సీరియస్ అయ్యారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. ఎక్కడ వీటిని ఫ్యాబ్రికేట్ చేశారు? ఎవరు ప్రచారం చేశారు? అన్న అంశాలపై ఎన్నికల సంఘం విచారణ చేపట్టింది.
సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ చేయడంతో పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో ఎవరు ఫ్యాబ్రికేట్ చేశారనే అంశంపై ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉండగా ఉప ఎన్నికకు నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 14వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఉప ఎన్నిక కోసం అధికార కాంగ్రెస్, ప్రతిపక్షం బీఆర్ఎస్ సహా బీజేపీ సిద్ధమయ్యా యి. అభ్యర్థులను ప్రకటించిన ఈ మూడు పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి.
బోగస్ ఓట్లు తొలగించాలంటూ జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై సీజే అపరేశ్ కుమార్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. జూబ్లీహిల్స్‌తో సంబంధం లేనివారు ఓటర్ జాబితాలో చేరారని బీఆర్‌ఎస్ తరఫున న్యాయవాది దామా శేషాద్రినాయుడు తన వాదనలు వినిపించారు. జూబ్లీహిల్స్‌లో 19వందలకు పైగా బోగస్ ఓట్లు ఉన్నాయని బెంచ్కు తెలిపారు. 12 వేల మంది బయటి వ్యక్తులకు ఓట్లు ఉన్నాయన్నారు. కొంతమందికి రెండు ఓట్లు కూడా ఉన్నాయని వివరించారు. పిటీషనర్లు చీఫ్ ఎలక్ర్టోరల్ అధికారికి ఫిర్యాదు చేశారని ఎలక్షన్ కమిషన్ తరఫు న్యాయవాది అవినాష్ కోర్టుకు తెలిపారు.
ఓటర్ల నమోదు అనేది నిరంతర ప్రక్రియని, 21వ తేదీ వరకు పరిశీలన చేస్తారని వాదనలు వినిపించారు. ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారిని సైతం వివరణ అడిగినట్లు ఈసీ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇరు పక్షాల వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం ఈ పిటిషన్‌లో ప్రత్యేక ఆదేశాలు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపింది. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందన ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొన్నది. ఈ కేసు విచారణను ముగిస్తున్నట్టు తెలిపింది.