ఉద్యోగాలు తీసేసి రోడ్డున పడేస్తరా?

ఉద్యోగాలు తీసేసి రోడ్డున పడేస్తరా?
  • ఉద్యోగాలు తీసేసి రోడ్డున పడేస్తరా?
  • తెలంగాణ తెచ్చుకున్నది ఇందుకేనా?
  • వరంగల్​లో మంత్రి ఎర్రబెల్లిని అడ్డుకున్న ఉపాధి హామీ ఫీల్డ్​ అసిస్టెంట్లు 
  • వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్​
  • తర్వాత మాట్లాడుదామంటూ వెళ్లిపోయిన మంత్రి

వరంగల్‍  రూరల్‍, వెలుగు: పద్నాలుగేండ్ల నుంచి ఉపాధి హామీలో పనిచేస్తున్న తమను ఎట్ల తొలగిస్తారంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావును ఫీల్డ్​ అసిస్టెంట్లు నిలదీశారు. తెలంగాణ తెచ్చుకున్నది తమ ఉద్యోగాలు పోగొట్టుకునేందుకేనా అని మండిపడ్డారు. వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 21న సీఎం కేసీఆర్‍  వరంగల్‍  టూర్‍  నేపథ్యంలో శనివారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు, చీఫ్ విప్‍ వినయ్​ భాస్కర్‍, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్‍, అరూరి రమేశ్‍  హన్మకొండ ఆర్‍ అండ్‍ బీ గెస్ట్​హౌస్​లో  ప్రెస్‍మీట్‍ నిర్వహించారు. అనంతరం బయటకు వెళ్తుండగా ఫీల్డ్​ అసిస్టెంట్లు మంత్రి ఎర్రబెల్లిని కలిసేందుకు వచ్చారు.

అప్పటికే మంత్రి తన వెహికల్‍ ఎక్కడంతో..  ఫీల్డ్​ అసిస్టెంట్లు ఆయన వద్దకు వెళ్లి తమ సమస్యను చెప్పుకున్నారు. ఎర్రబెల్లి వారి సమస్యను వింటూనే.. ‘తర్వాత మాట్లాడుదాం’ అంటూ అక్కడ్నుంచి బయలుదేరే ప్రయత్నం చేశారు. దీంతో ఫీల్డ్​ అసిస్టెంట్లు మంత్రి కాన్వాయ్‍కు అడ్డుగావెళ్లి.. ‘‘మంత్రి ఎర్రబెల్లి డౌన్‍డౌన్‍.. ప్రభుత్వ వైఖరి నశించాలి” అంటూ నినాదాలు చేశారు. ఉద్యోగాల్లోంచి తీసేసి తమను రోడ్డున పడేశారని మండిపడ్డారు. టీఆర్‍ఎస్‍  లీడర్లు, పోలీసులు వారిని బలవంతంగా పక్కకు జరిపి వెహికల్​లో మంత్రిని పంపించేశారు.

దీంతో ఫీల్డ్ అసిస్టెంట్లు గేటు వద్ద మిగతా వాహనాలకు అడ్డంగా కూర్చొని ఆందోళన చేశారు. ఏండ్లుగా ఉపాధి హామీలో పనిచేస్తున్న తమను ప్రభుత్వం అకారణంగా తొలగించిందని అన్నారు.  ‘‘మేమేం తప్పుచేసినం? మమ్మల్ని ఎందుకు రోడ్డుపాలు చేసిన్రు. చేతిలో పైసలు లేక, తిండి లేక, పిల్లలకు చదువు చెప్పించలేక ఆగమైతున్నం” అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ కాంట్రాక్ట్​ను  రెన్యూవల్‍ చేసి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్​ చేశారు. నిరసన తెలుపుతున్న పలువురిని అక్కడ్నుంచి పోలీసులు స్టేషన్‍కు తరలించారు.