హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నిరసనకు దిగింది. మేయర్ పోడియం దగ్గర ఫ్లకార్డులతో బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేశారు. ఎంత చెప్పినా బీఆర్ఎస్ సభ్యులు వినకపోవడంతో సభను10 నిమిషాల పాటు వాయిదా వేశారు మేయర్ గద్వాల విజయలక్ష్మీ. ఈ క్రమంలో సీఎం డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ సభ్యుల పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బీఆర్ఎస్కు పోటీగా సీఎం జిందాబాద్ అంటూ కాంగ్రెస్ సభ్యుల స్లోగన్స్ చేశారు. ఇరు వర్గాల పోటాపోటీ నినాదాలతో కౌన్సిల్ దద్దరిల్లింది.
మరోవైపు.. మజ్లిస్, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. జాతీయ గీతం వందేమాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కౌన్సిల్లో వందేమాతరం గీతాన్ని ఆలపించారు సభ్యులు. తర్వాత రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ పాట పాడారు. అయితే.. వందేమాతరం, జయ జయహే తెలంగాణ గీతాల ఆలాపన సమయంలో కుర్చీలో నుంచి కొందరు మజ్లిస్ కార్పొరేటర్లు లేవలేదు.
దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ సభ్యులు జాతీయ, రాష్ట్ర గీతాన్ని ఎంఐఎం సభ్యులు అవమానిచారంటూ ఆందోళనకు దిగారు. దేశంలో ఉండాలంటే వందేమాతరం గీతం పాడాల్సిందే అంటూ నినాదాలు చేశారు. దీనిపై మజ్లిస్ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బీజేపీ, మజ్లిస్ కార్పొరేటర్ల మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. పోటాపోటీగా కుర్చీల పైకి ఎక్కి ఆందోళన చేశారు బీజేపీ, ఎంఐంఎం కార్పొరేటర్లు. సభ జరిగేలా సహకరించాలని కాంగ్రెస్ సభ్యులు కోరారు.
